డీజేకి సంబంధించి ఇంటర్వ్యూల పర్వం మొదలైంది. అల్లు అర్జున్ ఈరోజు ప్రింట్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అయితే అవి కాస్త వెరైటీగా సాగడంతో మీడియా మిత్రులు బుర్రలు గోక్కోవాల్సివచ్చింది. సాధారణంగా గ్రూప్ ఇంటర్వ్యూలు, పర్సనల్ ఇంటర్వ్యూలు అంటూ రెండు రకాలుగా సాగుతాయి. అయితే ఈసారి బన్నీ మాత్రం ఈ రెండింటినీ మిక్స్ చేశాడు. ఒక్కో మీడియా ప్రతినిథికీ కేవలం 5 నిమిషాల సమయమే ఇచ్చారు బన్నీ పీఆర్వోలు. బన్నీ ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు బన్నీ చుట్టూ కనీసం పదిమందైనా ఉన్నార్ట. అందులో హరీష్ శంకర్, దిల్ రాజు, బన్నీ పీఆర్వోలు, ఈ సినిమా పీఆర్వోలూ.. బన్నీతో పాటుగా కూర్చున్నార్ట. `డీజే గురించి తప్ప మరో ప్రశ్న అడక్కండి` అంటూ ముందే గట్టిగా చెప్పార్ట. ఒకవేళ అడిగితే.. బన్నీ చుట్టు పక్కల వాళ్లు `ఈ ప్రశ్న వద్దు బ్రదర్` అంటూ పక్కన పెట్టేస్తున్నార్ట. హీరో ఇంటర్వ్యూ అంటే హీరో ఒక్కడే ఉండాలి గానీ.. ఈ గ్యాంగ్ ఏంటి?? అంటూ మీడియా మిత్రులు ప్రశ్నిస్తున్నారు. ఇదేదో బన్నీని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినట్టు లేదని, బన్నీనే తమని ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ఉందని మీడియా ప్రతినిధులు చెబుతున్నారు.
ఓ ప్రధాన పత్రికపై బన్నీ కోపంగా ఉన్నాడని తెలుగు 360 ముందే చెప్పింది. తాను ఒకటి చెబితే పత్రికల వాళ్లు మరోటి రాస్తున్నారన్నది బన్నీ ఉద్దేశం. అందుకే ప్రింట్ మీడియాని దూరంగా ఉంచుదాం అనుకొన్నాడు. కానీ.. అది కుదరదాయె. అందుకే… ఇలా ఇంటర్ వ్యూలు ఇచ్చినట్టే ఇచ్చి తన పంతం నెగ్గించుకొన్నాడన్నమాట.