ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం తన వైఖరిని ఎప్పటికిప్పుడు ప్రదర్శిస్తూనే ఉంది! ఈ మధ్యనే, విశాఖ ఉత్సవాల్లో ఎయిర్ షో నిర్వహించేందుకు రాష్ట్రం అన్ని ఏర్పాట్లు చేసుకుంటే… చివరి నిమిషంలో కేంద్రం నుంచి అనుమతుల్ని నిరాకరించారు! దీంతో నిర్వాహకులు ఒకింత నిరాశకు గురి కావాల్సి వచ్చింది. ఉద్దేశపూర్వకంగానే అనుమతులు రాలేదనీ, రాజకీయ పక్షపాత బుద్ధితో మోడీ సర్కారు వ్యవహరించిందనే విమర్శలు చాలా వినిపించాయి. ఇప్పుడు అలాంటిదే మరో నిర్ణయం తీసుకుంది కేంద్రం! ఈ నెల 26న జరగబోయే గణతంత్ర దినోత్సవంలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన శకటాలేవీ లేకుండా చేశారు..!
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతీయేటా దేశ రాజధాని ఢిల్లీలో పేరేడ్ జరుగుతుంది. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి శకటాల ప్రదర్శన ఉంటుంది. ఆయా రాష్ట్రాల సంస్కృతులను అద్దం పట్టడంతోపాటు, దేశ సమగ్రతకు చిహ్నంగా నిలిచే శకటాలను ప్రదర్శిస్తారు. ఈ ఏడాది శకటాలు ప్రదర్శించాలనుకునే రాష్ట్రాల నుంచి గత ఏడాది ఆగస్టు నెలలోనే రక్షణ శాఖ నుంచి ఆహ్వానాలు పంపారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మూడు డిజైన్లను కేంద్రానికి ప్రతిపాదించింది. విజయవాడ గాంధీ కొండ, పొందూరు ఖద్దరు, పల్లిపాడు సత్యాగ్రాహాశ్రమం… ఈ నమూనాలను పంపించింది. అయితే, వీటిని ప్రదర్శనకు తిరస్కరించడంపై కొంతమంది అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, చివరి రౌండ్ వరకూ ఆంధ్రా నమూనాలు ఎంపిక అయ్యాయనీ, చాలా బాగున్నాయంటూ అధికారులూ మెచ్చుకున్నారనీ, కానీ చివరి నిమిషంలో ఎందుకు పక్కనపెట్టేశారో తెలీడం లేదన్నది కొంతమంది ఆవేదన.
ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. గణతంత్ర వేడుకల్లో ఆంధ్రా శకటం లేకుండా చేయడం కచ్చితంగా వివక్షే అన్నారు. ఆంధ్రా అంటే మోడీకి అసూయ, అక్కసు ఎక్కువైపోయాయనీ, హుందాతనంతో వ్యవహరించడం మానేశారని సీఎం విమర్శించారు. నిజానికి, ఏపీ పంపిన నమూనాలు కూడా గాంధీ స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఉన్నవే. వాటిలో రాష్ట్ర ప్రభుత్వ విజయాలో, పరోక్షంగా టీడీపీకి ప్రచారంగా ఉపయోగపడే అంశాలో అస్సలు లేవు. అయినాసరే, ఏపీ శకటాలకు స్థానం లేకుండా చేయడాన్ని ఏమని అర్థం చేసుకోవాలి..?