తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన రైతు బంధు పథకం.. దేశవ్యాప్తంగా.. చర్చనీయాంశమైన మాట నిజం. ఆ పథకం ఆధారంగా.. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గెలిచినట్లు భావించడంతో.. పలు రాష్ట్రాలు.. అలాంటి పథకాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం కూడా.. అదే మోడల్లో.. ” ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి” పథకాన్ని ప్రారంభించింది. ఇదంతా అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే.. ఈ పథకం బాగా రైతులకు చేరువ చేయాలంటే.. ఏం చేయాలన్నదానిపై..మోడీ ఓ సీఎంల కమిటీ నియమించారు. అందులో… కేసీఆర్‌కు చోటు దక్కలేదు.
దేశంలో మొదటి సారి “రైతు బంధు” పేరిట ఎకరాకు రూ. 10 వేల రూపాయలు ఇచ్చే పథకానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. పార్లమెంట్ ఎన్నికల ముందే .. ప్రధాని మోడీ దాదాపుగా ఇదే పథకాన్నికిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ప్రారంభించారు. ఈ పథకం అమలుపై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ కమిటీకి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కన్వీనర్ గా ఉంటారు. కర్నాటక, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్ , మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రులకు ఈ హైపవర్ కమిటీలో అవకాశం ఇచ్చారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ హైపవర్ కమిటీలో కేసీఆర్ కు చోటు దక్కలేదు.
ఇదే విషయం ఢిల్లీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. మోడీ, కేసీఆర్‌ల మధ్య సంబంధాలు బెడిసికొట్టడంతోనే ఈ కమిటీలో కేసీఆర్ కు అవకాశం దక్కలేదనే చర్చ సాగుతోంది. రెండో సారి ప్రదానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత .. ఆయనను కలిసేందుకు కేసీఆర్ ఇష్టపడటం లేదు. ప్రమాణస్వీకారానికి వెళ్లలేదు..నీతి ఆయోగ్ భేటీకి వెళ్లలేదు. జమిలీ ఎన్నికలపై అఖిలపక్ష భేటీకి కూడా వెళ్లలేదు. ఇప్పుడు..మోడీ రైతుబంధు కమిటీలో చోటు కూడా ఇవ్వలేదు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య సంబంధాలు… మునుపటిలా లేవని మాత్రం స్పష్టమవుతోంది.