వచ్చే ఎన్నికలలోగా రెండు తెలుగు రాష్ట్రాలలో శాసనసభ సీట్లు పెరుగుతాయనే ముఖ్యమంత్రుల హామీలు, 2026 వరకు అమలు చేయడం కాదని ఇవ్వాళ్ళ కేంద్రం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ లో 20మంది వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాలోకి, తెలంగాణాలో కాంగ్రెస్, తెదేపాలకి చెందిన 16మంది ఎమ్మెల్యేలు తెరాసలో చేరారు. కేంద్రం చేసిన ఆ ప్రకటనతో వారందరి భవిష్యత్ అగమ్యగోచరంగా మారినట్లయింది. వారిదే కాదు సిట్టింగ్ ఎమ్మెల్యేలకి కూడా ఇది చాలా ఆందోళన కలిగించే విషయమే. సిటింగ్ ఎమ్మెల్యేలు, పార్టీలో కొత్తగా వచ్చి చేరినవారిలో ఎవరికి టికెట్స్ దక్కుతాయో తెలియదు కనుక అందరూ ఆందోళనపడక తప్పదు.
ఈ పరిస్థితిలో తెదేపా, తెరాసలలో కొనసాగడం కంటే మళ్ళీ తమ స్వంత గూటికి ఇప్పుడే తిరిగి చేరుకొంటే కనీసం అక్కడైనా తమ సీట్లు తమకే దక్కుతాయని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు భావించినట్లయితే, త్వరలోనే అందరూ స్వంత గూళ్ళకి బయలుదేరే అవకాశం ఉంది. తెలంగాణాలో తెదేపా దెబ్బతిని ఉంది కనుక ఆ పార్టీ నుంచి తెరాసలో చేరిన ఎమ్మెల్యేలు అటువంటి ఆలోచన చేయకపోవచ్చు. కానీ నేటికీ తెలంగాణా కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది కనుక తెరాస లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెనక్కి తిరిగి వెళ్ళే అవకాశం ఉందని భావించవచ్చు.
అదేవిధంగా ఏపిలో వైకాపా నుంచి తెదేపాలోకి వచ్చి చేరినవారందరూ మళ్ళీ స్వంత గూటికి బయలుదేరినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే, తెదేపాలో ఎప్పుడూ టికెట్స్ కోసం చాలా తీవ్రమైన పోటీ నెలకొని ఉంటుంది. శాసనసభ సీట్లు పెరిగే అవకాశం లేదని స్పష్టం అయ్యింది కనుక వైకాపా నుంచి వచ్చి చేరిన ఎమ్మెల్యేలు సిటింగ్ ఎమ్మెల్యేలతో టికెట్స్ కోసం పోటీ పడలేరు. పడినా ప్రయోజనం ఉండకపోవచ్చు. కనుక ఇవ్వాళ్ళ కాకపోతే రేపయినా అందరూ స్వంత గూటికి బయలుదేరక తప్పదు. ఇది తెదేపాకి చాలా ఆందోళన కలిగిస్తే వైకాపాకి చాలా సంతోషం కలిగించే విషయమే.