ఎన్నికలు అనగానే ప్రధాన పార్టీలు సినీ తారల సేవలను ప్రచారంలో ఒకప్పుడు వాడుకునేవి. కానీ, రానురాను ఆ సంప్రదాయం తెరమరుగు అవుతోంది. తమ సేవలను వాడుకొని వదిలేస్తున్నారనే భావనతో ప్రచారాలకు దూరం పాటిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో రాజకీయ రంగస్థలంపై తమదైన ముద్ర వేస్తారని ఆశించినా అలాంటిదేం కనిపించడం లేదు.
ప్రస్తుత ఎన్నికల్లో తెలంగాణలో సినీ తారల సందడి ఎక్కడా కనిపించడం లేదు. విజయశాంతి, బాబు మోహన్, జయసుధలు యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నా ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు. బండ్ల గణేష్ మల్కాజ్ గిరి టికెట్ కోసం పలుమార్లు మీడియా ముందు కనిపించారు. కానీ , టికెట్ తనకు దక్కకపోవడంతో ఆయన ఇప్పుడు మీడియా ముందుకు రావడం లేదు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి ఫలితాల విడుదల రోజు కనిపించారు. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లోనూ కనిపించకపోవడం చర్చనీయాంశం అవుతోంది. గతేడాది బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిన బాబూ మోహన్ కూడా బయటకు రావడం లేదు.
జయసుధ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. గతంలో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమె వైసీపీ, టీడీపీ అంటూ పొలిటికల్ కెరీర్ ను డేంజర్ జోన్ లో వేసుకున్నారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ ఉన్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయడం లేదు.
ఒకప్పుడు నటులతో ప్రచారానికి నాయకులు తెగ ఆసక్తి చూపేవారు.కానీ, రానురాను అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు తారలు ఎవరూ ముందుకు రావడం లేదు. లోక్ సభ ఎన్నికల వేళ తారలంతా ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ లోటును భర్తీ చేస్తున్నారు.