అనంతపురం జిల్లా.. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టంది. ఉన్న పధ్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 స్థానాల్లో ఘన విజయం సాధించింది. కదిరి, ఉరవకొండల్లో మాత్రం చాలా స్వల్ప తేడాతో టీడీపీ అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత కదిరి ఎమ్మెల్యే టీడీపీలో చేరారు. ఈ సారి అవే ఫలితాల్ని రిపీట్ చేయాలని టీడీపీ పట్టుదలగా ఉంది. బలమైన అభ్యర్థులు ఆ పార్టీకి ప్లస్ పాయింట్‌గా మారారు. మరో రకంగా చెప్పాలంటే.. బలమైన అభ్యర్థులే ఆ పార్టీకి మైనస్‌గా కూడా ఉన్నారు.
టీడీపీలో జేసీ అలజడి..!
అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాలకుగానూ కేవలం ఐదింటికి మాత్రమే తొలి జాబితాలో చంద్రబాబు అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. వారిలో ధర్మవరం నుంచి గోనుగుంట్ల సూర్యనారాయణ, పుట్టపర్తి నుంచి పల్లె రఘునాథరెడ్డి, హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ, రాప్తాడు నుంచి పరిటాల శ్రీరామ్, పెనుకొండ నుంచి బీకే పార్థసారథి ఉన్నారు. హిందూపురం పార్లమెంటు పరిధిలో కదిరి, మడకశిరతో పాటు అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఏడు స్థానాలూ ప్రకటించకుండా పెండింగ్‌లో ఉంచారు. ఎంపీ అభ్యర్థిగా కుమారుడ్ని పోటీకి నిలబెడుతున్న జేసీ దివాకర్ రెడ్డి… మార్పుచేర్పులపై పట్టుబడుతూండటంతో.. ఈ ప్రకటన వాయిదా పడింది. మామూలుగా అయితే.. అనంతపురం నుంచి వైకుంఠం ప్రభాకర్ చౌదరి, తాడిపత్రి నుంచి జేసీ అస్మిత్‌రెడ్డి, రాయదుర్గం నుంచి కాలవ శ్రీనివాసులు, ధర్మవరం నుంచి గోనుగుంట్ల సూర్యనారాయణ, కదిరి నుంచి కందికుంట వెంకటప్రసాద్, హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ, మడకశిర నుంచి ఈరన్న, పెనుకొండ నుంచి బీకే పార్థసారథి, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్, రాప్తాడు నుంచి పరిటాల సునీత, పుట్టపర్తి నుంచి పల్లె రఘనాథరెడ్డిలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అభ్యర్థులను ఖరారు చేయకుండా పెండింగులో ఉంచిన శింగనమల, గుంతకల్లు, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో సిట్టింగులను కచ్చితంగా మార్చాల్సిందేనని ఆయన పట్టుబడుతున్నారు. తాను చెప్పిన అభ్యర్థుల్ని నిలబెట్టకపోతే.. పోటీలో ఉండనని తన మార్క్ హెచ్చరికలు కూడా చేస్తున్నారు.
సిట్టింగ్‌లకు అసమ్మతి టెన్షన్..!
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సిట్టింగ్‌కు కాకుండా అక్కడి స్థానికులకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని టీడీపీ అధిష్ఠానానికి సూచించారు. శింగనమల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే యామినీబాలను మార్చి ఆమె స్థానంలో బండారు శ్రావణికి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. గుంతకల్లు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ స్థానంలో మాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌గుప్తాను తీసుకురావాలని ఆయన ప్రయత్నాలు చేశారు. పనిలో పనిగా అనంతపురం సిట్టింగ్ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరికి కాకుండా మరొకరికి టికెట్ ఇవ్వాలని ఆయన సూచిస్తున్నారు. జేసీ తీరుపై.. టీడీపీ నేతలు మండి పడుతున్నారు. తామే ఎంపీగా జేసీ దివాకర్‌రెడ్డిని వద్దంటున్నామని కళ్యాణదుర్గం, గుంతకల్లు, శింగనమల, అనంతపురం నియోజకవర్గాల నుంచి పలువురు జేసీకి వ్యతిరేకంగా గళం విప్పారు.
వైసీపీలో ఎవరు అభ్యర్థులవుతారో ఎవరికీ తెలియదు..!
వైసీపీలో సీట్లు ఖరారయ్యాయో లేదో ఎవరికీ తెలియడం లేదు. వైసీపీలో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీ నాయకత్వం, శ్రేణులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నామినేషన్ల ప్రారంభ ప్రక్రియకు ముహూర్తం దగ్గరపడుతున్నా అభ్యర్థులను ప్రకటించడంలో జాప్యం ఆ పార్టీ ఆశవాహుల్లో మరింత అలజడి రేపుతోంది. కొంతకాలంగా నియోజకవర్గాల సమన్వయ కర్తల మార్పు ఎప్పటికప్పుడు జరిగిపోతుండటంతో ఎప్పుడేమి జరుగు తుందోనన్న మీమాంసలో ఆ పార్టీ స్థానిక నాయకత్వాలు, శ్రేణులున్నాయి. నియోజకవర్గ సమన్వయకర్తలకు టికెట్‌పై భరోసా లేకపోవడంతో ప్రచార కార్యక్రమాలు ప్రారంభించలేదు. ఒక్కో చోటు ఇద్దరు, ముగ్గురు సమన్వయకర్తలున్నారు. టిక్కెట్ ఎవరికో ఇంత వరకూ సూచనలు కూడా పంపలేదు. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత అవకాశం దక్కని వారు ఏం చేస్తారోనన్న ఆందోళన వైసీపీ నేతల్లో వ్యక్తం అవుతోంది.
అనంతపురం జిల్లాలో అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాతే.. బరిలో ఎవరికి అడ్వాంటేజ్ అన్నదానిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.