ప్రముఖ తమిళ నటుడు రజనీ కాంత్ కి కేంద్రప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డుని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన అంత కంటే ఇంకా పెద్ద అవార్డు అందుకోవడానికి కూడా అన్నివిధాల అర్హుడు కానీ పద్మా అవార్డులకి రాజకీయాలకి మధ్య కనబడకుండా ఉన్న సన్నటి గీత వలన ఇంతకాలం ఆయన అటువంటి పురస్కారాలకి నోచుకోలేదు. అటువంటి వాటి కోసం ఆయన ఏనాడు రాజకీయనాయకులతో రాసుకుపూసుకు తిరగలేదు. ప్రధాని నరేంద్ర మోడి మొదలు రాష్ట్ర స్థాయి వరకు గల రాజకీయ నాయకులే ఆయన మద్దతు కోరుతూ ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ అయన ఇప్పటికీ అన్ని పార్టీలకు సమన దూరం పాటిస్తూ తటస్థంగానే ఉంటున్నారు.
ఈ ఏడాది తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. కనుక ఈసారి ఆ రాష్ట్రంలో వీలయినన్ని ఎక్కువ స్థానాలు దక్కించుకొని అక్కడ కూడా తమ పార్టీని విస్తరించాలని ప్రధాని నరేంద్ర మోడి, ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కలలు కంటున్నారు. కానీ ఆ రాష్ట్రంలో అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే లేదా మరొక బలమయిన ప్రాంతీయ పార్టీ మద్దతు ఉంటే తప్ప అక్కడి ప్రజలు ఏ పార్టీని పట్టించుకోరు. ప్రధాని నరేంద్ర మోడి ఇప్పటికే అమ్మ (జయలలిత)ను ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆమె ఇంత వరకు సానుకూలంగా స్పందించలేదు. అలాగని బీజేపీతో పొత్తులు పెట్టుకోబోమని తేల్చి చెప్పలేదు కూడా.
ప్రతిపక్ష డీఎంకే పార్టీ బీజేపీతో పొత్తులకి సిద్దంగా ఉన్నప్పటికీ, అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తుండటంతో ఆ పార్టీతోనే పొత్తులకి మొగ్గు చూపుతోంది. ఒకవేళ తమతో పొత్తులు పెట్టుకోవడానికి అమ్మ నిరాకరిస్తే అప్పుడు తప్పనిసరి పరిస్థితులలో కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే పార్టీతోనే పొత్తులు పెట్టుకోక తప్పదు. ఒకవేళ అదీ వద్దనుకొంటే తప్పనిసరిగా మరో ప్రాంతీయ పార్టీనో లేకపోతే ప్రజలపై తీవ్ర ప్రభావం చూపగల వ్యక్తినో చూసుకోవలసి ఉంటుంది.
తమిళనాడు ప్రజలపై రజనీకాంత్ ప్రభావం ఎంతగా ఉందో అందరికీ తెలుసు. ఒకప్పుడు చిరంజీవి రాజకీయ ప్రవేశంపై ఆంధ్రాలో రాజకీయ నేతలు, అభిమానులు ఎంత ఆత్రుతగా ఎదురుచూసారో అదేవిధంగా రజనీకాంత్ రాజకీయ ప్రవేశం కోసం కూడా తమిళనాడులో ఎదురుచూస్తున్నారు. కానీ దేవుడు అనుమతిస్తే తప్ప రాలేనని చెపుతూ ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నారు. వయోభారం, అనారోగ్య కారణాలచేత ఆయన సినిమాలు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. కనుక ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఈసారి తప్పకుండా రాజకీయాలలోకి వస్తారని చాలా జోరుగా ప్రచారం జరుగుతోంది. కనుక బీజేపీతో ఆయన కలిసి పని చేసేందుకు ఇష్టపడినా లేకపోతే కనీసం మద్దతు పలికినా చాలు తమిళనాట అల్లుకుపోగలమని బీజేపీ భావిస్తోంది.
సరిగ్గా ఇటువంటి సమయంలో మోడీ ప్రభుత్వం ఆయనకీ పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించడంతో సహజంగానే అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ఆయన మద్దతు కోసమే ఆయనకీ ఈ అవార్డు ప్రకటించిందని అందరూ అనుకొంటున్నారు. కానీ ఆయనకు ఈ అవార్డు ప్రకటించడం వెనుక ఎటువంటి రాజకీయ ఉద్దేశ్యాలు లేవని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. కానీ తాటి చెట్టు క్రింద కూర్చొని పాలు త్రాగుతున్నామని చెపితే ఎవరూ నమ్మరు కదా…అందుకే ఆయన సంజాయిషీ ఇచ్చుకోవలసి వచ్చిందేమో?