నిన్న మొన్నటి వరకూ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. నిన్నటి వరకూ ఒకరిపై ఒకరు కారాలు, మిరియాలు నూరుకున్నారు. నిన్నటి వరకూ ఒకరిపై ఒకరు నిందల నిష్టూరాలతో రెచ్చిపోయారు. కాని ఇప్పుడు అందరిదీ ఒకే మాట. అదే కరోనాపై పోరుబాట. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా రాజకీయ విమర్శలకు కాసింత విరామం ఇస్తారేమో కాని తెలంగాణలో మాత్రం అలాంటి విరామం ఉండదు. మిగిలిన రాష్ట్ర్రాలతో పోలిస్తే తెలంగాణలో రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ. అదే స్ధాయిలో రాజకీయ విమర్శలు, ఆరోపణలు కూడా ఎక్కువ. విచిత్రం ఏమిటంటే ఇతర ప్రాంతాలలో సొంత పార్టీ నాయకుల మీద విమర్శలు చాలా తక్కువ. కాని తెలంగాణ రాజకీయ పార్టీల్లో ప్రజాస్వామ్యం ఎక్కువ. దీంతో బయటి పార్టీలతో పాటు సొంత పార్టీల్లోని నాయకులపై కూడా విమర్శలు గుప్పిస్తారు. దీనికి కాంగ్రెస్ పార్టీ అగ్రతాంబూలం తీసుకుంది. అయితే, ఇదంతా నిన్నటి వరకే. ఇప్పుడు తెలంగాణలో రాజకీయ పార్టీల నాయకుల నోళ్లకు రాజకీయ విమర్శల మాస్క్ లు పడ్డాయి. అధికార పార్టీ మాత్రమే కాదు ప్రతిపక్ష పార్టీలు కూడా విమర్శలకు తాళం వేశాయి. చిటికీ మాటికీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే నాయకులు కిమ్మనడం లేదు. తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ నాయకుడ్ని కదిపినా కరోనా… కరోనా… కరోనా తప్ప మరో మాట లేదు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రతిపక్షాలకు చెందిన నాయకులు సలహాలు, సూచనలు చేస్తున్నారు. కరోనా కట్టడయ్యేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా మద్దతు ఇవ్వాలంటూ ప్రతిపక్ష నాయకులు మాట్లాడడం ఓ మంచి సంప్రదాయానికి తెర తీసినట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.