వైసిపి నేతలు మాట్లాడితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న్యాయవ్యవస్థను మేనేజ్ చేస్తున్నారని ఆరోపిస్తుంటారు. చర్చలలో పదే పదే అంటుంటారు. మొత్తం వ్యవస్థను ఎవరైనా ఎలా మేనేజ్ చేస్తారని అడిగితే ఏదో చెబుతుంటారు. కొంతమంది న్యాయమూర్తుల పేర్లు కూడా ప్రస్తావిస్తుంటారు. కాని తమాషా ఏమంటే సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో జస్టిస్ రమణ, చంద్రబాబు ఓకే విధమైన అభిప్రాయాలు ఒకే సమయంలో వ్యక్తం చేశారని ఆరోపించిన విషయం ప్రచురించలేదు, ప్రసారం చేయలేదు. ఎకనామిక్ టైమ్స్ ప్రచురించిన ఈ సాధికార కథనం వైసీపీ విమర్శలకు చాలా దగ్గరగా వుంది. అయినా సరే వేయకపోవడానికి కారణమేమిటి? ఒక్కటే- అనేక కేసులు ఎదుర్కొంటున్న జగన్కు దానివల్ల నష్టం కలుగుతుందన్న సంకోచం. ఇదొక్కటే గాక అప్పుడప్పుడూ కొన్ని కీలక విషయాలను సాక్షి సంస్థలు దాటేయడం కనిపిస్తూనే వుంటుంది. ఏం చేస్తాం- ఎవరి సమస్యలు వారివి కదా!