భార్యను బెదిరించడానికి ఉరి వేసుకుంటున్నట్లుగా నటించాడో భర్త. కానీ ఆ ఉరి తాడు నిజంగానే బిగుసుకుపోయి చనిపోయాడు.. కాపడటానికి కూడా అవకాశం లేకుండా పోయింది.. ఇదీ ఇటీవల వైరల్ అయిన ఓ వార్త. ప్రాణాల పరంగా కాకుండా.. ఉద్యోగ పరంగా చూసుకుంటే.. ఆ భర్తకు.. ప్రవీణ్ ప్రకాష్‌కు పెద్ద తేడా లేదు. ఏడేళ్లు సర్వీస్ ఉన్నా.. వీఆర్ఎస్ కు అప్లయ్ చేసుకుని ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేద్దామనుకున్నారు. కానీ యాక్సెప్ట్ చేసే సరికి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. ఇప్పుడు తాను వీఆర్ఎస్ ఉపసంహరించుకుంటానని ప్రభుత్వ పెద్దల కాళ్లా వేళ్లా పడేందుకు రెడీ అయ్యారు.
జగన్ రెడ్డి సర్వీస్ బ్యాచ్ అధికారుల్లో ప్రవీణ్ ప్రకాష్ కీలకం. తోటి అధికారుల్ని ఆయన వేధించిన వైనాన్ని ఎవరూ మర్చిపోలేరు. జగన్ రెడ్డి దగ్గర పలుకుబడి ఆసరా చేసుకుని ఆయన వ్యవహరించిన విధానంతో అందర్నీ వ్యతిరేకం చేసుకున్నారు. టీచర్లను వేధించారు. విద్యాశాఖలో అవినీతికి ఆయన కీలకంగా వ్యవహరించారు. ప్రభుత్వం మారిన తర్వాత ఆయన.. రివర్స్ గేమ్ ఆడాలనుకున్నారు. తాను ఈ ప్రభుత్వంలో పని చేయలేనని … నాటకాలు ఆడారు. వీఆర్ఎస్ తీసుకుంటానని మొదట తెల్ల కాగితం మీద రాయడం.. తర్వాత డిజిటల్ సంతకం చేసి ఇవ్వడం వంటి పనులు చేశారు. అయితే ఫార్మాట్ లో ఇవ్వాల్సిందేనని సీఎస్ స్పష్టం చేయడంతో అదే పని చేశారు. రెండు రోజుల్లోనే యాక్సెప్ట్ చేసిన ప్రభుత్వం ఇంటికి పంపేసింది.
సెప్టెంబర్ నెలాఖరు ఆయనకు లాస్ట్ వర్కింగ్ డే. ఇప్పుడు ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వడం లేదు. హెడ్ క్వార్టర్ లో ఉండి రిటైర్మెంట్ రోజు… సర్దుకుని వెళ్లిపోవడమే. ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్.. వీఆర్ఎస్ తీసుకుని తప్పు చేశానని.. ఆవేశంలో నిర్ణయం తీసుకున్నానని తన ఉద్యోగం తనకు ఇప్పించాలని ఆయన ప్రభుత్వ పెద్దల్ని కోరుతున్నారు. సమయం ఇస్తే వచ్చి బతిమాలుకుంటానని అంటున్నారు. కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం.. దండం పెట్టేసి… అంతా అయిపోయింది.. మీ దారి మీరు చూసుకోండని అంటున్నట్లుగా చెబుతున్నారు.
ప్రవీణ్ ప్రకాష్ వ్యవహారం చూసి .. ఆయన వల్ల బాధపడిన అధికారులు బాగా అయిందని పార్టీలు చేసుకుంటున్నారని సెక్రేటేరియట్ ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు.