బాహుబలి, బాహుబలి 2 సినిమా మధ్య ఏకంగా నాలుగేళ్లు గడిపేశాడు ప్రభాస్. 2019లో సాహో వచ్చినా, అభిమానుల ఆశలు, అంచనాలూ తీర్చలేకపోయింది. 2020లో రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న జాన్ (వర్కింగ్ టైటిల్)ని విడుదల చేస్తారనుకున్నారు. అయితే ఈ సినిమా 2020లో రావడం లేదు. 2021 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని కృష్ణంరాజు ధృవీకరించారు కూడా. త్వరలోనే యూరప్‌లో మరో దఫా చిత్రీకరణ జరుగుతుందని, 2020 చివరి నాటికి షూటింగ్ పూర్తవుతుందని 2021 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని కృష్ణంరాజు తెలిపారు. ఈ చిత్రంలో గోపీకృష్ణా మూవీస్ సంస్థ కూడా భాగం పంచుకున్న సంగతి తెలిసిందే. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ఇందులో కృష్ణంరాజు సైతం ఓ కీలకమైన పాత్ర పోషించడం. `బిల్లా`లో ప్రభాస్, కృష్ణంరాజు కలసి నటించారు. ఆ తరవాత వీరిద్దరూ వెండి తెరపై కనిపించబోతున్న సినిమా ఇదే. మొత్తానికి ప్రభాస్‌ని ఈ యేడాది చూడలేమన్నమాట. ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఇది చేదువార్తే.
ప్రభాస్ సినిమాకి మరీ అన్ని రీషూట్లు జరిగాయా?
ఈ సినిమా 2021 వేసవికి వాయిదా పడటానికి కారణం.. రీషూట్లే అని తేలింది. ఇది వరకు ఇటలీలో ఓ షెడ్యూల్ జరిగింది. ఆ తరవాత హైదరాబాద్‌లో కొంత మేర షూటింగ్ జరిపారు. మళ్లీ ఇటలీ వెళ్లకుండా ఉండాలని, ఆ వర్క్ అంతా హైదరాబాద్‌లోనే చేయాలన్నది చిత్రబృందం ఆలోచన. అలానే షూటింగ్ కూడా పూర్తి చేశారు. ఇటలీలోని తెరకెక్కించిన సన్నివేశాల్ని మ్యాచ్ చేస్తూ హైదరాబాద్‌లో దాదాపు 20 శాతం సినిమా తీసేశారు. అందుకోసం అన్నపూర్ణ స్డూడియోలో కొన్ని సెట్లు కూడా రూపొందించారు. ఇప్పుడు తాజాగా చిత్రబృందం మరోసారి ఇటలీ వెళ్లాలని భావిస్తోంది. అంటే.. ఇది వరకు అక్కడ తీసిన సన్నివేశాలన్నీ పక్కన పెడుతున్నారన్నమాట. అంతేకాదు.. హైదరాబాద్‌లో తీసిన కొన్ని సన్నివేశాల్ని కూడా రీషూట్ చేయాల్సివస్తోందట. 2020 వేసవిలోగానీ, దసరాలోనీ రావాల్సిన ఈ సినిమా 2021 వేసవికి వాయిదా పడిందంటే, ఏ మేరకు రీ షూట్లు జరిగాయో అర్థం చేసుకోవచ్చు.