ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన జరిగినప్పుడు… ప్రభుత్వం చాలా గంభీరమైన ప్రకటనలు చేసింది. ప్రమాదకరమైన రసాయనాలతో ఉత్పత్తులు చేసే పరిశ్రమలన్నింటినీ గుర్తించామని.. వాటి దగ్గర ప్రమాదాలు జరగకుండా.. అన్ని చర్యలు తీసుకున్న తర్వాత ఉత్పత్తి ప్రారంభానికి అవకాశం కల్పిస్తామని ప్రకటన చేసింది. ఇక ప్రమాదాలు జరగవని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడే అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయి. కార్మికులు.. ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నాయి. నంద్యాలలో ఎస్పీవై కెమికల్స్‌లో అమ్మోనియా గ్యాస్ లీకై… జనరల్ మేనేజర్ చనిపోగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఆ ఘటన ఇంకా లైవ్‌లో ఉండగానే.. విశాఖ ఫార్మాసిటీలో.. మరో కంపెనీలో గ్యాస్ లీకేజీ చోటు చేసుకుంది.
సాయినార్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అర్థరాత్రి రియాక్టర్ నుంచి బెంజిన్ మెడిజోన్ గ్యాస్ లీకైంది. విధుల్లో ఉన్న షిఫ్ట్ ఇన్చార్జ్ నరేంద్ర, కెమిస్ట్ గౌరీశంకర్ చనిపోయారు. మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. విషయం తెలిసిన వెంటనే..అధికారులు ఫార్మా పరిశ్రమ వద్దకు వెళ్లారు. వివరాలు బయటకు తెలియకుండా కట్టడిచేశారు. కంపెనీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి స్పందించారని.. వివరాలు తెలుసుకున్నారని సీఎంవో ప్రకటించింది.
అయితే.. వరుసగా జరుగుతున్న ప్రమాదాలు.. కెమికల్స్ ఉపయోగించే పరిశ్రమలు .. కనీస జాగ్రత్లు తీసుకోవడం లేదన్న విషయాన్ని బట్టబయలు చేస్తున్నాయి. ఎల్జీ ప్రమాదంలో పూర్తి స్థాయి మానవ నిర్లక్ష్యం.. తప్పిదమే ప్రమాదానికి కారణం అని స్పష్టమయింది. నంద్యాలలో ఎస్పీవై పరిశ్రమలోనూ అదే పరిస్థితి. ప్రమాదకరంగా ఉందని.. చెప్పినా.. అధికారులు నోటీసులు ఇచ్చినా ఆ సంస్థ పట్టించుకోలేదు. ఇప్పుడు వైజాగ్‌లో మరో ప్రమాదం. ప్రభుత్వం చేస్తున్న హెచ్చరికలను కంపెనీలు సీరియస్‌గా తీసుకోకపోవడం… కనీస జాగ్రత్తల వి,యంలో నిర్లక్ష్యంగా ఉండటం వల్లనే ఈ సమస్య వస్తోందన్న భావన ఏర్పడుతోంది. అన్నింటినీ తనిఖీ చేసి.. బాగుంటేనే.. .ఉత్పత్తి కార్యకలాపాలకు అనుమతి ఇస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటనలు కూడా.. ఉత్తదేనని వరుస ప్రమాదాలతో తేట తెల్లమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.