ఓ పథకం ప్రకారమే సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డిని వైకాపాలో పక్కనపెడుతున్నారంటూ చాన్నాళ్ల నుంచీ కథనాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అలాంటిదేదీ లేదూ, గిట్టనవారి పుకార్లు ఇవీ అంటూ వైకాపా నేతలు మీడియా ముందుకు కౌంటర్లు ఇస్తుండేవారు. చివరికి, మేకపాటి కూడా ఆ విషయాన్ని నేరుగా ఒప్పుకోకుండా… తనకు పార్టీలో మంచి స్థానమే ఉందంటూ చెప్పుకునేవారు!! అయితే, టీడీపీ నేత ఆదాల ప్రభాకర రెడ్డి వైకాపాలో చేరికతో మేకపాటిని పక్కనపెట్టడం పరిపూర్ణమైపోయిందని భావించొచ్చు. మేకపాటి స్థానంలోనే ఆదాలకు ఎంపీ టిక్కెట్ ఖరారు చేశారు జగన్.
ఆదాల చేరికను టీడీపీకి తగిలిన పెద్ద షాక్ అంటూ వైకాపా మీడియా హడావుడి చేస్తోందిగానీ… ఆయన చేరికను మేకపాటి వర్గం ఎంత సీరియస్ గా తీసుకుందీ, ఎంత ఆవేదనతో ఉందనే వాస్తవాన్ని పార్టీ కూడా పట్టించుకుంటున్నట్టు లేదు! మేకపాటి రాజమోహన్ రెడ్డికి ఆదాల తీరని ద్రోహం చేశారంటూ స్థానిక వైకాపా వర్గాల్లోనే చర్చ మొదలైంది. మేకపాటి కుటుంబానికి బంధువై కూడా చివరి నిమిషంలో పార్టీకి వచ్చి మోసం చేశారంటూ మేకపాటి వర్గీయులు గుర్రుగా ఉన్నారు. కేవలం ఎంపీ టిక్కెట్ కోసం ఇలా చేయడం కరెక్ట్ కాదనీ, తమ వర్గంతో ముందుగా చర్చించాల్సిందనీ ఆదాలపై విమర్శలు చేస్తున్నారు.
మేకపాటి రాజమోహన్ రెడ్డికి జగన్ టిక్కెట్ ఇచ్చే పరిస్థితి లేదంటూ కొన్నాళ్లుగా వినిపిస్తున్నదే. కేవలం ఆదాలకు అవకాశం కల్పించడం కోసమే ఒక పథకం ప్రకారం… మేకపాటి పనితీరు సరిగా లేదనీ, వచ్చే ఎన్నికల్లో ఆయన ఓటమి ఖాయమనే అభిప్రాయం వెల్లడయ్యేలా సర్వేలు తయారు చేయించారని రాజమోహన్ వర్గీయులు లోలోపల రగిలిపోతున్నారట! అయితే, తాజా పరిణామాలపై మేకపాటి ఇంకా స్పందించలేదు. ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం ఉందని ఆ వర్గీయులు అంటున్నారు. మేకపాటి కుమారుడు గౌతమ్ రెడ్డి ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారు. ఇదే క్రమంలో ఈసారి రాజమోహన్ రెడ్డి కూడా నెల్లూరు నుంచి ఎంపీగా పోటీలో ఉండాలి. కానీ, ఆదాల చేరికతో పరిస్థితి మారిపోయింది. మేకపాటి కుటుంబం రాజకీయంగా, ఆర్థికంగా చాలా నష్టపోయిందంటూ ఎప్పట్నుంచో అభిప్రాయపడుతున్న అభిమానులు, అనుచరుల ఆగ్రహాన్ని వైకాపా అధినాయకత్వం గుర్తిస్తుందా లేదా అనేది చూడాలి.