చిరంజీవి ఖైదీ నెం.150, బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ఱి.. రెండూ ప్రతిష్టాత్మక చిత్రాలే. చిరు 150వ సినిమా అయితే, బాలయ్యకు ఇది సెంచరీ చిత్రం. తొమ్మిదేళ్ల తరవాత చిరు రీ ఎంట్రీ ఇస్తుంటే… తొలి తెలుగు చక్రవర్తి ఘనతని చాటడానికి బాలయ్య ఓ సాహసం చేస్తున్నాడు. రెండూ సంక్రాంతికి వస్తున్నాయి. రెండింటిపై భారీ అంచనాలున్నాయి. పరిశ్రమ కూడా ఈ రెండు సినిమాల సత్తా ఏమిటో చూద్దామన్నట్టు ఉవ్విళ్లూరుతోంది. చిరు 11న, బాలయ్య 12న వచ్చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. కానీ ఈ రెండు సినిమాలకు ప్రీమియర్ షోలున్నాయా? పరిశ్రమలోని పెద్దల్ని ఆహ్వానించి సినిమా చూపిస్తారా?? స్పెషల్ షోల మాటేంటి?? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
చిరు, బాలయ్య ఇద్దరూ దశాబ్దాల పాటు చిత్రసీమని ఏలారు. ఇప్పటికీ వాళ్లకు ఆ స్టామినా ఉంది. ఈ రెండు సినిమాలకు జరిగిన మార్కెట్ చూస్తే ఆ విషయం ఈజీగా అర్థమైపోతుంది. పైగా ప్రతిష్టాత్మక చిత్రాలతో వస్తున్నారు. రిలీజ్ కి ముందే ప్రీమియర్లు వేస్తే భేషుగ్గానే ఉంటుంది. కానీ.. అటు చిరు గానీ, ఇటు బాలయ్య గానీ వాటి ఊసెత్తడం లేదు. ‘గౌతమి పుత్ర శాతకర్ణిని అందరి కంటే ముందు చూడాలనుకొంటున్నా..’ అంటూ ఓపెనింగ్ రోజునే కేసీఆర్ తన మనసులోని మాట బయటపెట్టారు. అటు చంద్రబాబు నాయుడు కూడా ఈ సినిమాని చూడ్డానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులకూ ఈ సినిమా చూపించాలని క్రిష్ ఆరాటపడుతున్నాడు. అయితే బాలయ్య మాత్రం ‘నో’ అంటున్నాడట. బాలయ్యకు అసలే ముహూర్తాల పిచ్చి. 12వ తేదీన ఏ సమయంలో ఈ సినిమా ప్రదర్శించాలన్న దానిపై ఇప్పటికే ఓ ముహూర్తం నిర్ణయించి చెప్పేశాడట. అదే ఫైనల్. ఆ టైమ్‌కే అన్ని చోట్లా షో పడాలి. అంతకు ముందు షో పడడానికి వీల్లేదు. దాంతో ప్రీమియర్ లు కాదు కదా, కనీసం ఫ్యాన్స్ షోలు వేయడానికి కూడా క్రిష్ సాహసించడం లేదు. పరిశ్రమలోని అందరు హీరోల్నీ పిలిచి ఓ ప్రీమియర్ వేస్తే బగుంటుంది అని చరణ్ భావిస్తున్నాడు. కానీ చిరు మాత్రం అందుకు అభ్యంతరం చెబుతున్నాడట. సినిమా విడుదలకు ముందే టాక్ బయటకు రావడం కరెక్ట్ కాదు.. సినిమా రిలీజ్ అయ్యాక.. అప్పుడు స్పెషల్ షోలు వేద్దాం అంటున్నాడట చిరు. బాలయ్య మాత్రం 11వ తేదీన గౌతమి పుత్ర చూడబోతున్నట్టు టాక్. ఆ రోజే వీలైతే చంద్రబాబుకీ ఈ సినిమా చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది. సో.. ప్రీమియర్ల విషయంలో ఇద్దరు హీరోలూ ఒకేలా ఆలోచిస్తున్నారన్నమాట.