తెలుగు సినిమాగా మొదలైన బాహుబలి.. ఆ తరవాత ఇంటర్నేషనల్ ఫిల్మ్ గా మారిపోయింది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ జనాలు.. బాహుబలి అంటే చెవి కోసేసుకొంటున్నారు. ఆ క్రేజ్‌ని రాజమౌళి అండ్ టీమ్ కూడా మా బాగా వాడుకొంటోంది. తెలుగులో ప్రమోషన్లు చేసుకొన్నా, లేకున్నా.. వచ్చిన మైలేజీ ఎలాగూ వచ్చేసింది. ‘మా సినిమా చూడొద్దు’ అన్నా సరే, ఎగబడి చూస్తారన్న ధీమా రోజు రోజుకీ పెరిగిపోతోంది. అందుకే తెలుగు మీడియాని ముందు నుంచీ చిన్న చూపు చూస్తూనే ఉంది బాహుబలి టీమ్. ముంబైలో ప్రమోషన్ల కోసం భారీ ఎత్తున టైమ్ కేటాయించిన రాజమౌళి అండ్ టీమ్.. తెలుగు నాట మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఇప్పుడు ప్రీమియర్ షోలూ అక్కడేనట.
ఈనెల 28న బాహుబలి 2 విడుదల కాబోతోంది. అందుకు ఒక్కరోజు ముందు అంటే… 27న ముంబైలో బాహుబలి హిందీ వెర్షన్‌ని ప్రదర్శిస్తారు. ఈ స్పెషల్ షోకి బాహుబలి 2 టీమ్‌తో పాటు, బాలీవుడ్ దిగ్గజాలు హాజరవుతారని సమాచారం. అంటే.. 27న తెలుగులో ప్రీమియర్ షోల హంగామా లేనట్టే. బాహుబలి 1 సమయంలోనూ ఇంతే. ముంబైలో ప్రత్యేక షో వేసి, అక్కడ పబ్లిసిటీకి వాడుకొన్నారు. ఇప్పుడూ.. తెలుగు మీడియాకు, ఇక్కడ సినీ ప్రముఖులకు హ్యాండిచ్చేయడానికి రెడీ అయిపోయాడు రాజమౌళి.