దావోస్.. స్విట్జర్లాండ్‌లోని ఈ పట్టణం పేరు వినిపిస్తే.. ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. ప్రతీ ఏడాది జరిగే సమావేశాలకు.. ప్రపంచ దేశాల అధినేతలు, ప్రముఖ వ్యాపారవేత్తలు వస్తారు. ప్రతీ జనవరిలో ఐదేళ్ల పాటు.. ప్రముఖంగా కనిపించేవి.. వినిపించేవి చంద్రబాబు దావోస్ భేటీలు. ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన తొలి దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశం దగ్గర్నుంచి.. ప్రతీ ఏడాది వెళ్లారు. ఎన్నికలు జరిగిన గత ఏడాది మాత్రం.. లోకేష్ నేతృత్వంలో ప్రతినిధి బృందాన్ని పంపారు. అక్కడ పారిశ్రామికవేత్తలతో సమావేశాలు.. సన్‌రైజ్ స్టేట్‌గా ఏపీని ప్రమోట్ చేయడానికి చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేసేవారు. అక్కడ బస్సులపై ఏపీ ప్రత్యేకతలు వివరిస్తూ ప్రకటనలు ఇచ్చారు. హోర్డింగులు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా స్టాల్ కూడా ఏర్పాటు చేసి.. పారిశ్రామికవేత్తలందరికీ.. ఆంధ్రప్రదేశ్ ప్లస్ పాయింట్లు వివరించేవారు.
పెట్టుబడిదారులను ఓ సారి ఏపీకి వచ్చి చూసి.. పెట్టుబడులకు అనుకూలమో కాదో.. చూడాలని ఆహ్వానించేవారు. ఓ ముఖ్యమంత్రి ఇంతా గౌరవంగా ఆహ్వానిస్తున్న కారణంగా.. కేవలం.. ఓ సారి చూద్దామనే.. ఉద్దేశంతోనే అనేక దేశాల బృందాలు ఏపీకి వచ్చాయి. వారిలో .. 30 శాతం మంది తర్వాత పెట్టుబడుల ప్రతిపాదనలతో వచ్చారు. టీడీపీ హయాంలో ఏపీకి వచ్చిన అనేక భారీ పరిశ్రమలకు దావోస్ చర్చలే కీలకంగా మారాయంటే.. అతిశయోక్తి కాదు. ఈ ఏడాది కూడా దావోస్ భేటీ జరిగింది. కానీ కొత్త ప్రభుత్వానికి పెట్టుబడులు.. పరిశ్రమలు ప్రాధాన్యతాంశం కాకుండా పోయింది. ఫలితంగా.. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఏపీ గురించి పట్టించుకునే వారే లేరు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నప్పటికీ.. మున్సిపల్ ఎన్నికల బాధ్యతను మొత్తం తానే తీసుకున్నప్పటికీ… ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల కోసం తెలంగాణ మంత్రి కేటీఆర్ దావోస్ వెళ్లారు. నాలుగు రోజుల పాటు కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. పెట్టుబడుల ప్రతిపాదనలతో వచ్చారు. కానీ ఏపీలో మాత్రం.. అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది.
ఏపీ ప్రభుత్వం పెట్టుబడిదారులను ఆకర్షించడం కాకుండా.. తరిమేయడం అజెండాగా పెట్టుకుందనే విమర్శలు మొదటి నుంచి వస్తున్నాయి. పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరించిన వ్యవహారశైలితో.. ఒక్క విదేశీ పెట్టుబడిదారుడు కూడా ఏపీ వైపు రావడం లేదు. పైగా.. ప్రపంచంలోని ప్రముఖ దేశాల్లో.. ఏపీ గురించి బ్యాడ్ ఇమేజ్ పడిపోయింది. అమరావతి ఒప్పందాల రద్దుతో సింగపూర్ లాంటి దేశాలు ఏపీని పట్టించుకోకూడని ప్రదేశాల జాబితాలో చేర్చాయి. విదేశీ పెట్టుబడులే కాదు.. స్వదేశీ పెట్టుబడిదారులు ఆదాని, రిలయన్స్ గుడ్ బై కొట్టేశారు. వీటన్నింటినీ చక్క దిద్దాల్సిన ఏపీ సర్కార్.. అమరావతిని నిర్వీర్యం చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. అమరావతిని నిర్వీర్యం చేస్తే పది లక్షల కోట్ల సంపద హుష్ కాకి అవుతుందని.. విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు సంతోషంగా ట్వీట్లు పెడుతున్నారంటే.. ఏపీకి పట్టిన దుర్గతిని సులువుగానే అర్థం చేసుకోవచ్చన్న విమర్శలు.. పారిశ్రామిక ప్రముఖుల నుంచి వస్తున్నాయి.