విజయాలు అపజయాలకు అతీతంగా రామ్గోపాల్ వర్మ సినిమాలకు ప్రచారం లభిస్తుంది. పేపర్, టీవీ, వెబ్ మీడియాల్లో వర్మ సినిమా వార్తలకు పాధాన్యం దక్కుతుంది. పబ్లిసిటీ ఎలా చేసుకోవాలో వర్మకు తెలిసిన ట్రిక్కు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విషయంలో వర్మ ట్రిక్కులేవీ పని చేస్తున్నట్టు కనపడటం లేదు. టాప్ పేపర్లు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ సినిమాను, వర్మను లైట్ తీసుకున్నట్టున్నాయి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో ఎన్టీఆర్ పాత్ర పోషిస్తున్న వ్యక్తి తాలూకూ టీజర్ విడుదల చేశాడు వర్మ. ట్విట్టర్లో టీజర్ విడుదల చేయడానికి ముందు చాలా హడావుడి చేశాడు. తనదైన శైలిలో ట్వీట్లు చేశాడు. కానీ, వర్మను పట్టించుకున్న నాథుడు లేడు. తెలుగులో అగ్ర దినపత్రికల్లో వర్మ ఎన్టీఆర్కి చోటు లభించలేదు. ఎన్టీఆర్ రూపురేఖలతో పోలిన వ్యక్తిని వెతికి పట్టుకోవడంలో సక్సెస్ అయిన వర్మ, సినిమాకు ప్రచారం కల్పించే విషయంలో కాస్త వెనకబడ్డాడు. ఎన్టీఆర్ బయోపిక్ ముందు వర్మ ఎన్టీఆర్ సినిమాపై మెజార్టీ ప్రేక్షకులు పెద్ద ఆసక్తి కనబరచడం లేదు. అన్నగారి అభిమానుల నుంచి ఈ సినిమాపై వ్యతిరేకత వస్తోంది. సినిమా విడుదల దగ్గర పడిన తరుణంలో వర్మ ఎలాంటి ట్రిక్కులతో రంగంలోకి దిగుతారో? ప్రతిసారీ ప్రచారంతో తప్ప సినిమాతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో వర్మ విఫలమవుతున్నారు. ఈ సినిమా ఫలితం ఏమవుతుందో?