హైదరాబాద్ రియల్ఎస్టేట్పై జరిగినంత వ్యతిరేక ప్రచారం ఇటీవలి కాలంలో దేనిపైనా జరగలేదు. మార్కెట్ పరిస్థితుల్ని పట్టించుకోకుండా పడిపోయింది.. అని ప్రచారం చేయడానికి అనేక అంశాలను తెరపైకి తెచ్చారు. వాటిలో ఒకటి హెచ్ఎండీఏ పరిధిలో గ్రామ పంచాయతీ లే ఔట్లలో రిజిస్ట్రేషన్లు నిలిపివేశారని ప్రచారం. ఇది ఎంత ఉద్ధృతంగా సాగిందంటే.. హెచ్ఎండీఏ గ్రామాల పరిధిలో గ్రామపంచాయతీ లే ఔట్లలో కొనేందుకు ఎవరూ ముందుకు రానంత పరిస్థితి ఏర్పడింది.
ఈ విషయంపై ఆలస్యంగా మేల్కొన్న హెచ్ఎండీఏ అధికారులు క్లారిటీ ఇచ్చారు. గ్రామ పంచాయతీ లే ఔట్ల విషయంలో తాము కొత్తగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని యధావిధిగా రిజిస్ట్రేషన్లు జరుగుతాయని ప్రకటించారు. ఇటీవలి కారంలో హెచ్ఎండీఏ నుండి రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖకు ఎలాంటి అభ్యర్థనను పంపలేదు. గ్రామ పంచాయతీ లేఅవుట్ల ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని స్పష్టంగా తెలియచేస్తున్నామన్నారు. దీంతో క్లారిటీ వచ్చిటన్లయింది.
రియల్ ఎస్టేట్ పడిపోయిందని జరుగుతున్న ప్రచారంతో రియల్టర్లు ఎక్కువ ప్రభావితం అవుతున్నారు. వారు పెడుతున్న పెట్టుబడికి.. వడ్డీలు పెరుగుతున్నాయి కానీ ప్లాట్లు అమ్ముడుపోవడం లేదు. స్థలాలు కూడా అంతే. అయితే అనేక విధాలుగా జరుగుతున్న తప్పుడు ప్రచారం విషయంలో ప్రజలకు ఎప్పటికప్పుడు నిజాలు అందించే విషయంలో హెచ్ఎండీఏ అధికారులు నిర్లక్ష్యంగా ఉండటం వల్లనే ఎక్కువగా నష్టం జరుగుతోందన్న వాదన వినిపిస్తోంది.