అదేంటో సాయికొర్రపాటి స్ట్రాటజీ వేరేలా ఉంటుంది. గప్‌చుప్ గా సినిమా తీస్తారాయన. హడావుడి లేకుండానే విడుదల చేస్తుంటారు. వారాహి చలన చిత్రం సంస్థలో వచ్చిన సినిమాలన్నీ (ఈగ మినహాయిస్తే) మాత్రం ప్రచార ఆర్భాటం లేకుండా విడుదలైనవే. ఆడియో ఫంక్షన్ మాత్రం కాస్త ఘనంగా చేస్తారు.. దానికి ఏకైక చీప్ గెస్ట్ ఎస్.ఎస్.రాజమౌళి. మీడియా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లూ, ప్రీ రిలీజ్ ఫంక్షన్లూ ఇవన్నీ ఆయనకు తెలీవు. కొత్త వాళ్లలో సినిమా అయినా, పేరున్న వాళ్లతో తీసినా ఆయన స్ట్రాటజీ ఇంతే. ఇప్పుడు యుద్దం శరణం సినిమాకీ అదే ఫాలో అవుతున్నారు. నాగచైతన్య చేసిన మాస్ సినిమా ఇది! ఓపక్క అర్జున్ రెడ్డి ఫీవర్ దంచి కొడుతుంటే.. విడుదల అవుతున్న సినిమా. యుద్దం శరణం టైటిల్ కూడా జనాల్లో సరిగా రిజిస్టర్ కాలేదు. సడన్‌గా ఈ సినిమాని వదిలేస్తున్నారు. నాగచైతన్య మొహం చూసైనా కాస్త ప్రచారం చేయాల్సింది. కానీ..`నేను మాట్లాడకూడదు.. సినిమానే మాట్లాడాలి` అన్న ఫీలింగ్ ఆయనది. అయితే… ఇలా చెప్పే గత సినిమాలకు కనీస ఓపెనింగ్స్ లేకుండా చేసుకొన్నారు. నాగచైతన్య సినిమా అంటే ఫస్ట్ డే, ఫస్ట్ షో చూసేయాల్సిందే అన్నంత కుతూహలం సామాన్య ప్రేక్షకుడికి ఉండదు. సినిమాలో ఏదో విషయం ఉందంటేనే వెళ్తాడు. `మా సినిమా ఇంత గొప్పగా ఉంటుంది` అని చెప్పుకోకపోతే ఎలా?? ఇంత గప్ చుప్‌గా సడీ సందడీ లేకుండా చైతూ సినిమా విడుదల కావడం ఇదే తొలిసారేమో. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.