‘ఎన్టీఆర్’లోని తొలిభాగం ‘కథానాయకుడు’ సంక్రాంతికి వచ్చింది. ఈ సినిమాకి భారీ ఎత్తున ప్రచారం చేసింది చిత్రబృందం. పైగా ఇది నందమూరి బాలకృష్ణ సొంత సినిమా. దాంతో ప్రమోషన్లు ఓ రేంజులో నిర్వహించారు. విద్యాబాలన్‌ని సైతం తీసుకొచ్చి ఇంటర్వ్యూలు ఇప్పించారు. క్రిష్, సుమంత్, కీరవాణి… ఇలా అందరూ ప్రమోషన్లలో తలో చేయీ వేశారు.
ఇప్పుడు రెండో భాగం ‘మహా నాయకుడు’ కూడా విడుదలకు రెడీ అవుతోంది. ఈసారీ మాత్రం ఈ స్థాయిలో ప్రచారం చేసే అవకాశాలు కనిపించడం లేదు. అసలు ప్రచారం ఉంటుందా? లేదంటే సైలెంట్‌గా సినిమాని వదిలేస్తారా? అనే అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఈ సినిమా గురించి మాట్లాడాల్సిందంతా మాట్లాడేశారు. పాటలూ ముందే బయటకు వచ్చేశాయి. పార్ట్ 2కి సంబంధించిన ట్రైలర్ తప్ప.. కొత్తగా చెప్పడానికీ, చూపించడానికీ ఏమీ లేదు. దానికి తోడు తొలి భాగం విజయవంతమైతే, ఆ జోష్‌తో రెండో భాగానికి మరింత ప్రచారం చేసేవాళ్లు. కానీ.. ఆ సినిమా డిజాస్టర్ జాబితాలో చేరిపోయింది. దాంతో.. చిత్రబృందం కూడా మీడియా ముందుకు రావడానికి సందేహిస్తోంది. కాకపోతే… ప్రచార హడావుడి లేకుండా సినిమా విడుదల చేస్తే బయ్యర్లు డీలా పడిపోతారు. వాళ్ల కోసమైనా ఏదో ఓ మొక్కుబడి కార్యక్రమం చేపట్టాల్సిందే.
అందుకే.. ట్రైలర్ లాంచ్‌తో ఈ సినిమా ప్రమోషన్లను సరిపెట్టాలని బాలయ్య భావిస్తున్నాడట. సరిగ్గా విడుదలకు రెండు మూడు రోజుల ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లా ఏర్పాటు చేసి, మహానాయకుడు ట్రైలర్ ని విడుదల చేద్దామని చూస్తున్నారు. కెమెరా, ఆర్ట్ విభాగాలకు చెందిన సాంకేతిక నిపుణులు ఇంత వరకూ మీడియా ముందుకు రాలేదు. వాళ్ల ఇంటర్వ్యూలతో ఈ ప్రచారానికి పుల్ స్టాప్పెట్టాలని బాలయ్య భావిస్తున్నాడట.