ఏ సినిమాకైనా పబ్లిసిటీ అవసరం. తెలుగులో ఆడాలనుకొన్న డబ్బింగులకైతే అత్యవసరం. గతేడాది ‘బిచ్చగాడు’ సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. అయితే ఆ సినిమాని రూ.50 లక్షలకు కొంటే కోటి రూపాయలతో పబ్లిసిటీ చేశారు. అందుకే ఆ స్థాయిలో ప్రజలకు చేరువైంది. అయితే.. ఈ వారం వస్తున్న రెండు డబ్బింగ్ సినిమాలూ ఈ నిజాన్ని విస్మరించాయి. వీఐపీ 2, వివేకం ఈ వారమే తెలుగులో విడుదల అవుతున్నాయి. వీఐపీ 2 ఆల్రెడీ తమిళంలో ఫ్లాప్ అయ్యింది. కాకపోతే.. రఘువరన్ బీటెక్ ఫీవర్తో తెలుగులో ఆ సినిమాకి మంచి ఓపెనింగ్సే వచ్చే అవకాశాలున్నాయి. కాకపోతే.. వీఐపీ 2 వస్తోందన్న విషయం చెప్పేదెవరు? ఆ సినిమాకి సరైన పబ్లిసిటీ లేదు. వివేకం ఇంకా దారుణంగా ఉంది. తమిళంలో అజిత్ అభిమానులకు కొదవ లేదు. అక్కడ అజిత్ పెద్ద స్టార్. ఈ సినిమాకి అక్కడ బోల్డన్ని ఓపెనింగ్స్ వస్తాయి. కానీ తెలుగు ప్రేక్షకుల మాటేంటి? ప్రేమలేఖ, వాలి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసుకు చేరువైన అజిత్ ఆ తరవాత సరైన విజయాన్ని అందుకోలేకపోయాడు. వివేకంకి మంచి బజ్ వచ్చింది. ఈ సినిమాకి మంచి రేట్లకు కొన్నారు కూడా. అలాంటప్పుడు పబ్లిసిటీ పై కూడా దృష్టి పెట్టాలి కదా? వీఐపీ 2 కోసం ధనుష్ రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నాడు. అజిత్ నుంచి అదీ లేదు. సినిమా ఎలాగూ హిట్టయిపోతుందన్న ఓవర్ కాన్ఫిడెన్సా?? అజిత్ సినిమా తమిళంలో ఆడితే చాలనుకొంటున్నారా?? పబ్లిసిటీ పరంగా ఈ రెండు డబ్బింగ్ సినిమాలూ ఫెయిల్ అయ్యాయి. మరి బాక్సాఫీసు మాటేంటో??