తెలంగాణలో లాక్ డౌన్ అవసరం లేదు… అసలు కోవిడ్ ఉందో లేదో అన్నట్లుగా ఉందని..చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి దిలాసాగా చెప్పారు. హైదరాబాద్‌కు రోజుకు 33 ఎయిర్ అంబులెన్స్‌లు వస్తున్నాయని… బెడ్లు కొరత కానీ.. ఆక్సిజన్ కొరత కానీ లేదని.. అంతా స్మూత్‌గా సాగిపోతోందని చెప్పుకొచ్చారు. ఆయన మాటలకు తగ్గట్లుగానే… తెలంగాణలో కరోనా కేసులు ఏ రోజూ ఆరేడువేలకు దాటడం లేదు. మృతుల సంఖ్యనూ అంతే… ముఫ్పై, నలభై మధ్య చూపిస్తున్నారు. దేశం మొత్తం కరోనాతో అల్లాడిపోతూంటే.. తెలంగాణలో మాత్రం ఇన్ని తక్కువ కేసులా అని అందరూ ఆశ్చర్యపోయే పరిస్థితి. మెట్రో సిటీలు ఉన్న రాష్ట్రాలు… కేసుల విస్ఫోటనంతో విలవిల్లాడిపోతున్నాయి. హైదరాబాద్ మాత్రం దానికి భిన్నం.
ఏ కట్టడి చర్యలు లేకుండానే వైరస్ కట్టడి అయిందా..!?
హైదరాబాద్ ఉన్న తెలంగాణలో కేసుల సంఖ్య ఎందుకు అంత తక్కువగా ఉంది.. ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుందా.. అంటే.. దేశంలో ఏ చర్యలూ తీసుకోని రాష్ట్రాల్లో తెలంగాణ ముందు ఉంది. హైకోర్టు … విచారణ జరిపినప్పుడల్లా.. చెడామడా విమర్శిస్తోందన్న కారణంతో నైట్ కర్ఫ్యూ విధించారు. అయితే ఆ కర్ఫ్యూ వల్ల ప్రయోజనం ఏమిటన్నదానిపై అనేక సందేహాలు ఉన్నాయి. ఇక ఏ రూల్స్ పెట్టలేదు. పెట్టే ఆలోచన కూడా చేయడం లేదని.. సోమేష్ కుమార్ మాటల్లోనే స్పష్టమైంది. ఇతర రాష్ట్రాల నుంచి యథేచ్చగా తెలంగాణలోకి వస్తున్నారు. అంటే.. ఎలాంటి కట్టడి లేని తెలంగాణలో.. కరోనా కట్టడి అయిందని.. ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది.
టెస్టులు తక్కవ.. మరణాల లెక్కలూ గోల్మాల్..!
నిజానికి ప్రభుత్వం ప్రకటిస్తున్నట్లుగా తక్కువ కేసులే ఉన్నాయా… అంటే..ఈ విషయం నమ్మశక్యంగా లేదని నిపుణులు తేల్చేస్తున్నారు. కరోనా పాజిటివిటీ రేటు.. టెస్టుల విషయంలో తెలంగాణ సర్కార్ నిర్లిప్తంగా ఉంటోందని ఈ కారణంగానే… పెద్దగా కేసులు వెలుగులోకి రావడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. తెలంగాణలో ఆర్టీపీసీఆర్ టెస్టులు పెద్దగా అందుబాటులో లేవు. ర్యాపిడ్ టెస్టుల సంఖ్యా తక్కువే. దీంతో కేసుల సంఖ్య తక్కువగా వెలుగు చూస్తోంది. అయితే అదే సమయంలో… మరణాల సంఖ్యనూ పరిమితంగా చూపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నిజానికి స్మశానాలకు తీరిక ఉండటం లేదు. ఎప్పుడూ చితిమంటలు కాలుతూనే ఉన్నాయి. సాధారణంతో పోలిస్తే.. రెట్టింపు కన్నా ఎక్కువ మృతదేహాలు వస్తున్నాయన్న ప్రచారం ఉంది. అందుకే హైకోర్టు కూడా.. స్మశానాల్లో ఎన్ని మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాలో చెప్పాలని ఆదేశించింది. కానీ ప్రభుత్వం మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. మొత్తంగా చూస్తే.. కేసులు..మరణాల విషయం ప్రభుత్వం అనేక విషయాలను దాచి పెడుతోందన్న ఆరోపణలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి.
ప్రజలకు నిజాలు చెప్పని మీడియా..!
మరో వైపు.. ప్రజల్ని అలా కరోనాకు వదిలేసినట్లుగా ఉన్నా.. మీడియా మాత్రం ఎప్పటిలాగే.. చూసి కూడా చూడనట్లుగా ఉంది. ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోకపోయినా.. ఆస్పత్రుల ముందు రోగులు అవస్థలు పడినా చూసీచూడనట్లుగానే ఉంటోంది. వరంగల్ ఎంజీఎం ముందు ఎంత దయనీయ దృశ్యాలు ఉన్నాయో..సోషల్ మీడియాలో రోజూ వైరల్ అవుతున్నాయి. కానీ ఏ ఒక్క మీడియా కూడా పట్టించుకోవడం లేదు. గాంధీ ఆస్పత్రి ముందు పదుల సంఖ్యలో అంబులెన్స్‌లు… పేషంట్లతో రెడీగా ఉంటాయి. మృతదేహాలు తీసుకెళ్లే అంబులెన్స్‌లు ఇరవై నాలుగు గంటలూ తిరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి వాటిని మీడియా రిపోర్ట్ చే్యడం లేదు. మొత్తంగా.. తెలంగాణలో కరోనా పరిస్థితిని కప్పి పుచ్చడానికి తెలంగాణ సర్కార్ ప్రయత్నిస్తోంది.. మీడియా సహకరిస్తోంది. కానీ నిజాన్ని బయట పెట్టి ప్రజల్ని అప్రమత్తం చేసే ప్రయత్నం చేయడం లేదన్న విమర్శలు మాత్రం గట్టిగానే వినిపిస్తున్నాయి.