కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ప్రజల్లో ఎలాంటి ఎమోషన్ కనిపించడం లేదు. కేవలం సోషల్ మీడియాలో మాత్రమే అదీ కూడా జాతీయ స్థాయిలో చేసిన కొన్ని ఫేక్ వీడియోల ద్వారా మాత్రమే ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ విద్యార్థులు బయటకు రాకుండా ఒక్క చోట కాపలా కాశారు పోలీసులు. ఇంకెక్కడా ఎలాంటి నిర్బంధాలు అమలు చేయలేదు. భూముల్లోకి కూడా యథేచ్చగా పోయి వచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాతే ఆ భూముల్లోకి ఇతరులు వెళ్లకుండా ఆదేశాలు ఇచ్చారు.
అది అడవి కాదని అందరికీ తెలుసు !
కంచ గచ్చిబౌలి అనేది అడవి కాదని అందరికీ తెలుసు. కానీ అటవి భూమి పేరుతో నమ్మించి వన్య ప్రాణుల పేరుతో హంగామా చేస్తున్నారు. ఆ వన్య ప్రాణులు హెచ్సీయూకు ఉన్న రెండున్నర వేల ఎకరాల్లో ఉంటాయని అందరికీ తెలుసు. వన్యప్రాణుల్ని వేటాడిన కేసులు కూడా గతంలో నమోదయ్యాయి. కంచ గచ్చిబౌలి భూములు గతంలోనే క్రీడా మౌలిక సదుపాయాల కోసం కేటాయించారు. కోర్టు కేసుల కారణంగానే అది నిరుపయోగంగా ఉంది. ఇప్పుడు కోర్టు కేసులు క్లియర్ కావడంతోనే ప్రభుత్వం వినియోగంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.
ఐటీ కారిడార్ డి ఫారేస్టేషన్ చేసిందెవరు ?
జూబ్లిహిల్స్ దగ్గర నుంచి ఐటీ కారిడార్ వరకూ పచ్చదనం లేకండా చేసి కాంక్రీట్ జంగిల్స్ ను నిర్మించింది ఎవరో ఎవరికీ తెలియకుండా ఉంటుందా ?. ఎకరం వంద కోట్లకు కొండలు గుట్టలు అమ్మేసిన రికార్డు పదిలంగానే ఉంది. కొన్ని వందల ఎకరాలను అలా అమ్మారు. అలాంటప్పుడు .. ఈ నాలుగు వందల ఎకరాల విషయంలోనే ఎకో పార్కులు ఎందుకు గుర్తుకొస్తున్నాయన్నది చాలా మందికి వస్తున్న సందేహం. ఇదంతా రాజకీయం అని సామాన్య ప్రజలకు అర్థమైపోయింది. అందుకే వారిలో కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఎలాంటి ఎమోషన్ కనిపించడం లేదు.
రేవంత్ కు సానుభూతి పెరిగే అవకాశం
ఈ వ్యవహారంలో అందరూ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తే ఆయనకు సానుభూతి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతో ఆయనను జాతీయ స్థాయిలో టార్గెట్ చేస్తున్నారన్న అభిప్రాయానికి సామాన్యులు వస్తున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ నేతలు చేస్తున్న అతి ప్రకటనలు.. వారు అంతకు ముందు చేసిన భూదందాలను గుర్తుకు తెస్తున్నాయి. ఇవన్నీ కలిపితే రేవంత్ పథకాలను ఇవ్వకుండా చేయడానికి.. పాలన సాగకుండా చేయడానికి కుట్ర చేస్తున్నారన్న భావనకు ప్రజలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వివాదంలో రేవంత్ కు ఎన్ని అడ్డంకులు కల్పిస్తే ఆయనకు అంత సానుభూతి వచ్చినా ఆశ్చర్యం ఉండదు.