పైసా వసూల్ కేవలం 78 రోజుల్లో తీసేశాం.. అని గొప్పగా చెప్పుకొంది చిత్రబృందం. ఓ బడా హీరో సినిమాని ఇంత స్పీడుగా తీయడం గొప్ప విశేషమే. కాకపోతే తెరపై క్వాలిటీ చూసి… బాలయ్య ఫ్యాన్స్ సైతం ఖంగు తింటున్నారు. ఈ సినిమాని చుట్టేశారా?? అన్న ఫీలింగ్ కలిగించింది. సింహభాగం హైదరాబాద్లోని సెట్లోనే తీశారు. పోర్చుగల్ లో తీసింది ఛేజింగ్ సన్నివేశాలు, ఫైట్లే. ఈ మాత్రం దానికి అక్కడ 40 రోజులు ఏం చేశారా అనిపిస్తుంది. పూరికి ఈ సినిమా కోసం రూ.35 కోట్లు కట్టబెట్టాడు నిర్మాత. ప్రమోషన్ ఖర్చు అదనం. పారితోషికాలతో కలిపి, అందులోనే సినిమా తీసిపెట్టాలి. మరి… తనకు గిట్టుబాటు కావాలి కదా? అందుకే వీలైనంతలో సినిమా చుట్టేయాలని ఫిక్సయ్యాడేమో పూరి. శ్రియ తప్పించి స్టార్ కాస్టింగేం కనిపించలేదు. అలీ మినహాయిస్తే కమిడియన్ గ్యాంగ్ లేదు. మూడు పాటలు సెట్లో తీసినవే. ఈ ప్యాకేజీతో పూరి బాగానే వెనకేసుకొన్నాడనిపిస్తుంది. పైసా వసూల్ అనే టైటిల్ కథకి కంటే పూరికి బాగా యాప్ట్ అయ్యిందని ఇండ్రస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాకపోతే… ప్రీ రిలీజ్ బిజినెస్ రూపంలో నిర్మాత పెట్టుబడిని రాబట్టుకొన్నాడు. మరి ఇప్పుడు బయ్యర్ల పరిస్థితేంటో చూడాలి.