విభజన హామీల విషయంలోనే కాదు.. చట్టంలో ఉన్న వివిధ అంశాల పట్ల కేంద్ర ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్ వ్యతిరేక వైఖరి తీసుకుంటోంది. తెలంగాణ కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన.. పిటిషన్‌కు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు… వరుసగా అఫిడవిట్లు దాఖలు చేస్తున్నాయి. తాజాగా కేంద్ర హోంశాఖ మరో అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో ఏపీకి షాక్ ఇచ్చే మరికొన్ని అంశాలను వెల్లడించింది. గతంలో ఉమ్మడి సంస్థల విభజన విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఈ అఫిడవిట్ ఉండటం సంచలనం సృష్టిస్తోంది. ఉన్నత విద్యామండలి ఆస్తుల పంపకం విషయంలో సుప్రీంకోర్టు జనాభా ప్రాదిపదికన పంచుకోవాలని స్పష్టమైన తీర్పు ఇచ్చింది. కేంద్రం హోంశాఖ దానిని అమలు చేయలేదు. గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం పదే పదే విజ్ఞప్తి చేసిన అమలు చేయలేదు. పదో షెడ్యూల్ లోని ఉమ్మడి సంస్థలన్నింటినకి ఆ తీర్పు వర్తిస్తుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. కానీ ఇప్పుడా తీర్పును పూర్తిగా పక్కన పెట్టేసింది 10వ షెడ్యూల్ లోని సంస్థలను.. జనాభా ప్రాతిపదికన విభజించాలని చట్టంలో లేదని… కేవసం సేవల్ని మాత్రమే మరో రాష్ట్రానికి అందజేయాలని విభజన చట్టంలో ఉన్నట్లు.. కేంద్ర హోంశాఖ అఫిడవిట్ లో పేర్కొంది.
కేంద్రం సుప్రీంకోర్టుకు ఓ మాట.. బయట ఓ మాట చెబుతున్నట్లు ఈ అఫిడవిట్ల ద్వారా మరోసారి తెలిపోయింది. ఉక్కు పరిశ్రమ, రైల్వేజోన్ పై వ్యతిరేకత నివేదికలు వచ్చినప్పటికీ… వాటి ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నామని.. రాజ్యసభలో రాజ్ నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. కానీ సుప్రీంకోర్టుకు తాజాగా సమర్పించిన అఫిడవిట్ లో మాత్రం పూర్తి భిన్నంగా పేర్కొన్నారు. రైల్వేజోన్ సాధ్యం కాదని… అఫిడవిట్ లో హోంశాఖ స్పష్టంగా పేర్కొంది. ఈ ఏడాది మార్చి పన్నెండో తేదీన జరిగిన సమీక్షా సమావేశంలో రైల్వేజోన్ ఏర్పాటుపై అధికారులు చేతలెత్తేశారని… ఇక జోన్ సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ అఫిడవిట్ లో స్పష్టం చేసింది. ఇప్పటికే పదహారు జోన్లు ఉన్నందువల్ల కొత్త జోన్ ఏర్పాటు చేయడం లాభదాయం కాదని అఫిడవిట్ లో తెలిపారు. రైల్వే జోన్, స్టీల్ ఫ్యాక్టరీ సాధించి తీరుతామని.. అవి వస్తాయని తెలిసే.. టీడీపీ నేతలు దీక్షలు చేస్తున్నారని.. బీజేపీ నేతలు కొంత కాలంగా చెప్పుకొస్తున్నారు. వారు కూడా రాజకీయం కోసం ప్రకటనలు చేస్తున్నారని.. తాజా అఫిడవిట్ తో తేలిపోయింది.
మెట్రో రైలుపైనా కేంద్రం అదే విధంగా స్పందించింది. నూతన మెట్రో నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే విజయవాడకు మెట్రో మంజూరు చేస్తామని అఫిడవిట్ లో కేంద్ర హోంశాఖ తెలిపింది. అమరావతి నిర్మాణంపై మాత్రం హోంశాఖ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ యూసీలపై మాత్రం.. తప్పుడు సమాచారం ఇచ్చారు. 15 వేల కోట్ల యూసీలు సమర్పించిటన్లు అఫిడవిట్ లో సుప్రీంకు తప్పుడు సమాచారం ఇచ్చారు. అనేక సంస్థల ఏర్పాటు ఇంకా డీపీఆర్ తయారీ…ఆమోదం దశలోనే ఉన్నాయని కేంద్రహోంశాఖ అంగీకరించింది. ఉద్యోగులు, ఇతర విషయాల్లో… రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్లే విభజన ఆలస్యమవుతోందని.. కేంద్రం అఫిడవిట్ లో చెప్పుకొచ్చింది.