తెలంగాణ సర్కారు అధికారంలోకి వచ్చి మూడేళ్లయింది. హైదరాబాద్ ను విశ్వ నగరంగా చేసేందుకు కృషి చేస్తున్నామనీ, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు రప్పిస్తున్నామనీ, అభివృద్ధికి అనువైన వాతావరణం భాగ్యనగరానికే సొంతమని విదేశీ వేదికలపై కూడా ప్రభుత్వ పెద్దలు చాటిచెప్పుకున్న సందర్భాలున్నాయి. అయితే, ఒక్క వర్షం.. గురువారం ఉదయం కురిసిన ఒకే ఒక్క వర్షం… భాగ్య నగర ప్రజలకు మళ్లీ నీటి కష్టాలను పరిచయం చేసింది. నిన్నమొన్నటి వరకూ ఎండలు మాడ్చేశాయి. వర్షంతో వాతావరణం కాస్త చల్లబడిందని అనుకోగానే… ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. నగరంలోని అంబర్ పేట్, అమీర్ పేట్, తార్నాక, బేగంపేట్, నిమ్స్, మలక్ పేట్ యశోద హాస్పిటల్ జంక్షన్.. ఇలా నగరంలో చాలాచోట్ల ఉదయాన్నే భారీ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దీంతో ప్రజలు చాలా అవస్థలు పడ్డారు.
ఇక, ప్రభుత్వం ఏం చేసిందంటే… వెంటనే అధికారులతో మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు! అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. అంతే.. పనైపోయింది! మధ్యాహ్నం 12 అయ్యేసరికి మళ్లీ ఎండెక్కేసింది. ట్రాఫిక్ జామ్ క్లియర్ అయిపోయింది. ప్రభుత్వం పని కూడా అయిపోయింది. మళ్లీ వర్షం పడ్డప్పుడే ఆలోచిస్తారు. అప్పుడు కూడా పరమ రొటీన్ గా మంత్రిగారు అధికారులు ఫోన్ చెయ్యడం, పరిస్థితిని సమీక్షించడం, బాధిత ప్రాంతాల్లో పర్యటన, చర్యలు తీసుకుంటామని ఊకదంపుడు ఉపన్యాసాలు దంచెయ్యడం. ప్రతీయేటా ఇదే జరుగుతోంది. హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఆ మధ్య మంత్రి కేటీఆర్ అన్నారు. నగరంలో ఒకట్రెండు రోజులు పర్యటనలు చేసి, అధికారులకు క్లాసులు తీసుకున్నారు.
వర్షాలు పడితే హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆందోళనను ఇటీవలే కేటీఆర్ వ్యక్తం చేశారు. వర్షాలు పడకపోయినా ఫర్వాలేదన్నారు. ఆందోళన వ్యక్తం చేస్తే సమస్యలు తీరుతాయా చెప్పండి..? ఇప్పటికీ హైదరాబాద్ లో సీవేజ్ సిస్టమ్ ఒక కొలీక్కి రాలేదు. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు దారి మళ్లించేందుకు కావాల్సిన ప్రణాళిక లేనే లేదు. ప్రతీయేటా సమ్మర్ లో మురుగు నీటి కాల్వల్ని బాగుచెయ్యడం, పూడిక తీయడం వంటివి చేపడితే… ఆ తరువాత వచ్చే వర్షాకాలంలో కాస్తైనా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ పనీ జరగడం లేదు. ప్రభుత్వమే ఆందోళన చెందుతుంటే శాశ్వత పరిష్కారం ఎక్కడిది..? ప్రతీయేటా వర్షాలు పడుతుంటాయి. ట్రాఫిక్ జామ్ లు అవుతుంటాయి. మ్యాన్ హోల్స్ దగ్గర ప్రమాదాలు జరుగుతుంటాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు కుప్పకూలుతుంటాయి. ఈ ఏడాది కూడా అలాంటి వార్తలే ఈ సీజన్ లో ఉంటాయి.. అంతే! అయినా, వర్షాకాలంలో తలెత్తే సమస్యల గురించి వేసవికి ముందే ఆలోచించాలిగానీ, ఓ పక్క వాన కురుస్తుంటే సమీక్షలూ సమావేశాలూ చర్యలూ అంటుంటే శాశ్వత పరిష్కారం ఎప్పటికి..?