లక్ష కోట్ల కుంభకోణం కేసులతో సహా ఆర్థిక వ్యవహారాలన్నిటా కీలకమైన తోడుగా వున్న ఆడిటర్ విజయసాయిరెడ్డికి వైసీపీ అధినేత జగన్ షాక్ ఇవ్వనున్నారా? సన్నిహితవర్గాల కథనాలు నిజమైతే ఇప్పటికే డోసుల వారిగా షాక్కు సిద్దం చేస్తున్నారు. ఈ దఫా రాజ్యసభకు విజయసాయిరెడ్డిని పంపిస్తారని చాలా కాలంగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. దానివల్ల విజయసాయిరెడ్డికి ఎంపిగా కేసుల నుంచి ఒకింత ఉపశమనం లభించడమే గాక ఢిల్లీలో ఆయన పాత్ర నిర్వహించడం తేలికవుతుందని అధిష్టానం ఆలోచిస్తున్నట్టు చెప్పేవారు. విజయసాయి కూడా దాదాపు ఆ విధంగానే ప్రవర్తిస్తూ వచ్చారు.
అయితే ఈ మధ్యన వైసీపీనుంచి విపరీతంగా ఫిరాయింపులు జరిగాయి. దాని తర్వాత జగన్ ఆలోచనల్లో మార్పు వచ్చిందంటున్నారు. ఒకవేళ మీకు రాజ్యసభ ఇవ్వలేకపోయినా తట్టుకోవడానికి సిద్దంగా వుండాలని ముందే చెప్పారట. ఆ స్థానాన్ని కాపు నేతలకు ఇవ్వడం మంచిదని ఈ వరసలో దాసరి నారాయణరావు, ముద్రగడ పద్మనాభం వంటివారి పేర్లు వినిపిస్తున్నాయని సమాచారం. ఇచ్చేది ఎవరికైనా విజయసాయికి దక్కదని మాత్రం వైసీపీ వర్గాలు బలంగా చెబుతున్నాయి. లోగుట్టు మట్టులన్నీ తెలిసిన సాయిరెడ్డిని దూరం చేసుకుంటారా లేక ఆయన ఎలాగైన విశ్వాసంతో వుంటారన్న నమ్మకంతోనే ఈ ఆలోచనలు చేస్తున్నారా..చూడాలి.