లాక్ డౌన్ నుంచి చిత్రసీమ మినహాయింపులు కోరుకుంటోంది. తామ బాధలు, ఇబ్బందులు, సమస్యలు చెప్పుకుంటూ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌కి వినతి పత్రాన్ని అందచేసింది. మంగళవారం నాటి కేసీఆర్ ప్రెస్ మీట్ లో చిత్రసీమకు కూడా ఏవైనా కొన్ని మినహాయింపులు ప్రకటిస్తారని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అన్ని రంగాల గురించీ మాట్లాడిన కేసీఆర్ సినిమాల గురించి ప్రస్తావించలేదు. ఆ సంగతి మర్చిపోయారో, లేదంటే… అసలు సినిమాల గురించి ఆలోచించలేదో తెలీదు గానీ, కేసీఆర్ నుంచి ఏమైనా మినహాయింపులు ఆశించిన చిత్రసీమని మాత్రం ప్రెస్ మీట్ నిరాశ పరిచింది.
షూటింగుల విషయంలో ప్రభుత్వం అనుమతిస్తుందన్న పెద్ద పెద్ద ఆశలేం చిత్ర రంగానికి లేవు.కనీసం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని ఎదురు చూసింది. కానీ అలాంటి సంకేతాలేం కనిపించలేదు. షూటింగ్ ముగించుకుని, ఎడిటింగ్, రీరికార్డింగ్, డబ్బింగ్ పనులు బాకీ పడిన సినిమాలెన్నో ఉన్నాయి. లాక్ డౌన్ ఎత్తేసేలోపు… ఆ పనులన్నీ చక్కబెట్టుకోవచ్చని దర్శక నిర్మాతలు భావించారు. థియేటర్లలో సినిమా విడుదల చేయకపోయినా, కనీసం ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌కి అమ్ముకోవాలన్నా సరే, సినిమా పూర్తి స్థాయిలో రెడీగా ఉండాలి కదా? ఆ అవకాశం కూడా ఇప్పుడు లేకుండా పోయింది. అయితే తలసాని శ్రీనివాస యాదవ్ మాత్రం ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని దర్శక నిర్మాతలకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అతి త్వరలో డబ్బింగ్ స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్లు, లాబ్ లకు పర్మిషన్లు ఇవ్వొచ్చన్న సంకేతాలు అందుతున్నాయి. డబ్బింగ్, ఎడిటింగ్, రీ రికార్డింగ్ పనులు పరిమిత వ్యక్తులతో ముగించుకునే సౌలభ్యం ఉంది. కనుక ముఖ్యమంత్రి ఈ విషయంలో సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది.