ఎల్జీ పాలిమర్స్ సంస్థ .. ఎక్కడైనా రిలీఫ్ దొరుకుతుందేమోనని.. తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎల్జీ పాలిమర్స్ ప్రాంగణాన్ని సీజ్ చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపైనా సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇప్పటికిప్పుడు సంస్థను సీజ్ చేయడం ప్రమాదకరం అని వాదించి.. పరిమితంగా ముఫ్పై మంది సంస్థలోకి వెళ్లేలా అనుమతి తెచ్చుకున్నారు. అయితే.. సీజ్ చేయమని ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఏ వాదనలనైనా ఎల్జీ పాలిమర్స్ సంస్థ …హైకోర్టు, ఎన్జీటీ ముందే వినిపించాలని స్పష్టం చేసింది.
ఎల్జీ పాలిమర్స్‌ను సీజ్ చేయాలని.. హైకోర్టు ఏకపక్షంగా ఆదేశించిందని తమ వాదన వినిపించుకోలేదని.. కంపెనీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎల్జీ పాలిమర్స్ సంస్థపై ఇప్పటికే ఏడు రకాల విచారణ కమిటీలు విచారణ జరుపుతున్నాయని తాము ఎవరి ముందు అని హాజరు కావాలన్నారు. కంపెనీని ఇప్పటికిప్పుడు సీజ్ చేస్తే.. అందులో ఉన్న రసాయనాల వల్ల ప్రమాదం అని వాదించడం వల్ల.. కాస్త రిలీఫ్ లభించినట్లుగా తెలుస్తోంది. ఎల్జీ పాలిమర్స్ సంస్థ పై ఎన్జీటీ విచారణకు ఆదేశించింది. హైకోర్టు కూడా.. పలు రకాల ప్రశ్నలను సంధిస్తూ.. నోటీసులు జారీ చేసింది.
అలాగే కంపెనీని సీజ్ చేయమని ఆదేశించింది. నిజానికి అంత పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత ఎవరైనా ముందుగా కంపెనీని సీజ్ చేస్తారు. ఎల్జీ పాలిమర్స్ కు మాత్రం.. అలాంటి కష్టం ఎదురు కాలేదు. దర్జాగా చరాస్థి అయిన పాలిస్టైరిన్ ను తరలించేశారు కూడా. ఈ తరుణంలో.. ఆ సంస్థ.. విచారణ కమిటీలను ఎదుర్కోకుండా.. సుప్రీంకోర్టు పిటిషన్లతో ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే సుప్రీంకోర్టు మాత్రం.. విచారణలపై ఎలాంటి స్టే ఇవ్వకుండా.. ఎలాంటి వాదనలైనా ఎన్జీటీ… హైకోర్టు ముందు చెప్పుకోవాలని స్పష్టం చేసింది.