ఎయిర్ టెల్ యాడ్లలో తెర మెరుస్తోంది శశా ఛత్రి. 4 జీకి సంబంధించిన యాడ్లతో శశ పాపులర్ అయిపోయింది.ఇప్పుడు సినిమా అవకాశాలూ వస్తున్నాయి. శశ ఇప్పుడు ఓ తెలుగు సినిమాలో కనిపించబోతోంది. వినాయకుడు లాంటి స్మూత్ కామెడీ సినిమాలు తెరకెక్కించిన సాయి కిరణ్ అడవి దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఇందులో శశ ఛత్రి కథానాయికగా నటిస్తోంది. దాదాపు 50 శాతం షూటింగ్ కూడా అయిపోయింది. ఇదో యాక్షన్ థ్రిల్లర్ అని, సినిమా ఓ కొత్త జోనర్లో సాగుతుందని తెలుస్తోంది. మరో విశేషం ఏమిటంటే… ఈ సినిమా కోసం శశా ఒక్క పైసా కూడా పారితోషికం తీసుకోలేదట. యాడ్ల రూపంలో తెగ పాపులర్ అయిపోయిన శశ.. తనకు అంత డిమాండ్ ఉన్నా సరే, ఓ తెలుగు సినిమాలో పారితోషికం లేకుండా నటించడం గొప్ప విశేషమే. కాకపోతే… ఆమె ఒక్కదానికే కాదు, చిత్రబృందంలో ఎవ్వరికీ రూపాయి కూడా రెమ్యునరేషన్ ఇవ్వలేదు. నటీనటులు, సాంకేతిక నిపుణులందరినీ వాటాదారుల్లోగా మార్చి.. ఓ కొత్త పద్ధతిలో రూపొందిస్తున్న సినిమా ఇది. సినిమా బిజినెస్ అయ్యాక… అప్పుడు ఎవరి వాటాలు వాళ్లకు దక్కుతాయన్నమాట. మరి ఈ కొత్త ప్రయత్నం, ప్రయోగం ఎంత వరకూ ఫలవంతం అవుతుందో చూడాలి.