ఏపీ ముఖ్యమంత్రి పవర్ ఫుల్. ఆ పవర్ ఎప్పుడు ఎలా వాడతారో అందరికీ తెలుసు. పగ, ప్రతీకారాల కోసం తప్పితే ఆయన పవర్ ఇంకెక్కడా పని చేయదు. నేరుగా బహిరంగసభల్లో .. లేదా మరో చోట ఇచ్చిన ఆదేశాలు కూడా అమలు కావు. సీఎం అలాగే ఉంటారని కానీ పట్టించుకోవద్దని అధికారులకు ఆదేశాలు వస్తాయో లేకపోతే నిధులు ఇవ్వకుండా ఆయన ఆదేశించి పోతే తామెక్కడపనులు చేస్తామని అనుకుంటారో కానీ… సీఎం జగన్ రెడ్డి ఆదేశాలకు పూచిక పుల్లంత విలువ లేకుండా పోయింది. ఎవరూ పాటించడంలేదు.
నాలుగున్నరేళ్లలో ఎన్నో వరాలు – ఒక్కటీ నెరవేర్చలేదు !
ఇటీవల అవనిగడ్డలో టీడీపీ, జనసేన ఓ ర్యాలీ నిర్వహించాయి. అదేమిటంటే జగన్ రెడ్డి ఏడాది కిందట అవనిగడ్డకు వచ్చి… ఓరోడ్ కోసం డబ్బులు విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇక నిర్మాణమే మిగిలిందన్నారు. ఏడాది తర్వాత కాంట్రాక్టు కూడా పిలవలేదు. ఇదేం పాలన అని టీడీపీ, జనసేన ర్యాలీ నిర్వహిస్తే వైసీపీ నేతలు, పోలీసులు కలిసి దాడులు చేశారు. ఓ సీఎం నేరుగా డబ్బులు రిలీజ్ చేస్తున్నా అని చెప్పిన హామీకే దిక్కు లేకుండా పోయింది. అదొక్కటి కాదు.. జగన్ సీఎం హోదాలో హామీలిచ్చిన.. ఆదేశాలిచ్చిన అభివృద్ది పనులు కానీ సాయాలు కానీ ఎవరికీ అందలేదు.. చేయలేదు.
చిరుద్యోగులకు ఇచ్చే మాటల్ని కూడా నెరవేర్చలేని అసమర్థ సీఎం
పాదయాత్ర చేసినప్పుడు తిరుమలలో పని చేసే పారిశుద్ధ్య కార్మికులకు జగన్ రెడ్డికొన్ని హమీలు ఇచ్చారు. దీంతో ఆ కార్మికులకు నాయకత్వం వహిస్తున్న మహిళ జగన్ సీఎంకావాలని తన చేతిపై పచ్చబొట్టు వేయించుకుని.. ఆయన సీఎం అయ్యే వరకూ చెప్పులు వేసుకోనని ప్రతిజ్ఞ చేశారు. జగన్ అధికారంలోకి వచ్చారు. కానీ వారి సమస్యలు పరిష్కారం కాలేదు. ఓసారి తిరుపతి పర్యటనకు వెళ్లినప్పుడు ఆమె కలిసేందుకు ప్రయత్నిస్తే అంగీకరిచంలేదు. మీడియాలో రచ్చ కావడంతో పిలిచి.. పక్కన అధికారుల్నిపెట్టుకుని ఆ డిమాండ్లన్నీ పరిష్కరించాలని ఆదేశించారు,కట్ చేస్తే ఆమె ఉద్యోగం ఉందో లేదో తెలియని పరిస్థితి. ఒక్క హామీ నెరవేరలేదు. పారిశుధ్య కార్మికురాలిపైనా అధికారాన్ని బలాన్ని ప్రయోగించారు కానీ.. మంచి చేద్దామని అనుకోలేదు.
ఏం చెప్పినా … జనాలు నమ్మని పరిస్థితి !
ఇలాంటి మోసాల వల్ల జగన్ రెడ్డి ఇప్పుడు ప్రజలకు ఏం చెప్పినా నమ్మని పరిస్థితి ఏర్పడింది. ఆయన గాలి కబుర్లు చెబుతారని పట్టించుకోలేమన్న వాదన వినిపిస్తోంది. సామాన్య ప్రజలు మాత్రమే కాదు వైసీపీ నేతలు కూడా ఆయనను నమ్మడం లేదు. జగన్ రెడ్డి పగ, ప్రతీకారాల విషయంలో ఇచ్చే ఆదేశాలు అమలవుతున్నాయో లేదో చూస్తారని… మిగతా ప్రజా సమస్యలకు ఆయనకు అక్కర్లేదని సెటైర్లు వేసుకుంటున్నారు.