ఆక్సిజన్ సప్లయ్ కోసం గ్లోబల్ టెండర్లు పిలిచామని కానీ ఒక్కరు కూడా ముందుకు రాలేదని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ప్రెస్మీట్లో నిర్వేదం వ్యక్తం చేసి.. రెండు, మూడు రోజులు కాలేదు.. ప్రభుత్వం వ్యాక్సిన్లు కావలెను అంటూ అంతర్జాతీయ ప్రకటన జారీ చేసింది గ్లోబల్ టెండర్లను పిలిచేసింది. అసలు ఎలాంటి పరిశోధనలు లేకుండా అందరికీ తెలిసిన టెక్నాలజీతో తయారు చేసే ఆక్సిజన్‌ను ఏపీకి అమ్మడానికే సిద్ధపడని ఇంటర్నేషన్ కంపెనీలు… ఇప్పుడు వ్యాక్సిన్ ఇవ్వడానికి పరుగులు పెట్టుకుంటూ వస్తాయా.. అన్నది చాలా మందికి వస్తున్న సందేహం. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ రూపొందించిన కంపెనీలు చాలాతక్కువ. వాటికి ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ. అందుకే పంపిణీలో కొరత ఏర్పడుతోంది.
కరోనా వ్యాక్సిన్ ధరలు బహిరంగ మార్కెట్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటిపై ఆయాదేశాల్లో పన్నులు కలుపుకుంటే చాలా ఎక్కువ అవుతాయి. ఇండియాలో అయితే మరీ ఎక్కువ. ప్రస్తుతం గ్లోబల్ టెండర్లు పిలిచిన ఏపీ సర్కార్‌కు వ్యాక్సిన్లు సరఫరా చేయాడానికి విదేశీ కంపెనీలు ముందుకు వస్తాయో లేదో తెలియదు కానీ.. ఎవైనా కంపెనీలు కానీ.. కంపెనీల నుంచి కొని సరఫరా చేస్తామని ముందుకొచ్చే కంపెనీలు కానీ పెద్ద ఎత్తున రేట్లు కోట్ చేసే అవకాశం మాత్రం ఉంది. ఓ కరోనా టెస్టింగ్ కిట్‌ను.. దేశీయ కంపెనీ ఒకటి రూ. అరవైకి దిగుమతి చేసుకుని ఏపీ సర్కార్‌కు రూ. ఆరు వందలకు అంటగట్టినవ్యవహారం ఇంకా కళ్ల ముందే ఉంది.
జూన్ 3న సాయంత్రం 5 గంటల్లోపు వ్యాక్సిన్ సరఫరా చేయాలనుకున్న కంపెనీులు డాక్యుమెంట్ల అప్లోడ్ చేయాలని.. ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది. జూన్ 3న సాయంత్రం ఐదుగంటలకు టెండర్లు తెరుస్తారు. ఈ నెల 20న సాయంత్రం 5 గంటలకు ప్రీ బిడ్ మీటింగ్ కూడా నిర్వహిస్తారు. అప్పుడే.. వ్యాక్సిన్ కంపెనీల ప్రతినిధులు ఎవరైనా వస్తే.. విదేశీ వ్యాక్సిన్లను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న నమ్మకం ఏర్పడుతుంది. లేకపోతే కష్టమవుతుంది.