ఆంధ్రప్రదేశ్ లో భాజపా నేతలు మైకావేశంతో చాలాచాలా మాట్లాడతారు! ఆంధ్రాకి అన్నీ ఇచ్చెయ్యడానికి కేంద్రం సిద్ధంగా కూర్చుకుని ఉంటే, ఎలా తీసుకెళ్లాలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలీడం లేదన్నట్టు మాట్లాడతారు! కానీ, ఢిల్లీ స్థాయిలో భాజపా నేతల వైఖరి మరోలా ఉంటోంది. వారికి కనీసం చీమకుట్టినట్టైనా ఉండటం లేదు. కడప స్టీల్ ప్లాంట్ విషయమై మరోసారి ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేశారు టీడీపీ నేతలు. రాయలసీమ ప్రాంత నేతలతోపాటు, టీడీపీ ఎంపీలు ఢిల్లీలో కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్ ను కలుసుకున్నారు. కడప ప్లాంటును వెంటనే ప్రకటించాలంటూ ఆయన్ని కోరారు. అయితే, మళ్లీ మళ్లీ ఎందుకు అడుగుతారు, ఒకసారి చెప్పాం కదా అన్నట్టుగానే ఆయన సమాధానం ఉండటం గమనార్హం. అంతేకాదు, ఈ పార్లమెంటు సమావేశాల్లో కడప స్టీల్ ప్లాంట్ ప్రకటించే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కట్టినట్టు చెప్పేయడం విశేషం.
కడప స్టీల్ అంశమై టీడీపీ ఎంపీలు రాష్ట్రపతిని కూడా కలిశారు. టీడీపీ నేతలందరికీ అనుమతి లేదనడంతో, కొంతమంది ఎంపీలతో కూడిన ప్రతినిధుల బృందం రామ్ నాథ్ కోవింద్ కి వినతిపత్రం ఇచ్చారు. సీఎం రమేష్, రామ్మోహన్ నాయుడు, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజులు రాష్ట్రపతిని కలిసినవారిలో ఉన్నారు. కడప స్టీల్ ప్లాంట్ విషయమై సీఎం రమేష్ చేసిన దీక్ష గురించి తాను విన్నానంటూ రాష్ట్రపతి సానుకూలంగానే స్పందించారు. అయితే, ఆయనకి వినతి పత్రం ఇచ్చినంత మాత్రాన… కేంద్ర ప్రభుత్వానికి ఆయన సూచిస్తారని ఆశించలేం. ఒకవేళ మర్యాదపూర్వకంగా ప్రధానికి రాష్ట్రపతి సూచించే ప్రయత్నం చేసినా… దాన్ని మోడీ ఎంత సీరియస్ గా పరిగణనలోకి తీసుకుంటారనేది ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం లేని విషయం!
ఏదేమైనా, ఆంధ్రా ప్రయోజనాల విషయమై కేంద్రం చిత్తశుద్ధి ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంది. ఓపక్క, ఈ పార్లమెంటు సమావేశాలు ముగిసేలోగానే కడప ప్లాంట్ ప్రకటించేస్తారన్నట్టుగా ఏపీ భాజపా నేతలు ఇక్కడ మాట్లాడతారు. కానీ, కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్ మాత్రం ఈ సెషన్స్ లో అలాంటి ప్రకటనకు ఆస్కారమే లేదనీ, ఇంకా మెకాన్ సంస్థ నుంచి నివేదిక రావాల్సి ఉందని చెబుతారు. ఒకవేళ కేంద్రానికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే… మెకాన్ సంస్థ నుంచి నివేదిక తెప్పించుకోవడం అనేది ఎంత పని..? కేంద్రం అన్నీ ఇచ్చేస్తుందని ఏపీ నేతలు అంటారు… కానీ, కేంద్రమంత్రుల తీరు ఇంకోలా ఉంటోంది. ఏదేమైనా, పట్టువదలక టీడీపీ ఎంపీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.