పదకొండేళ్ల సుదీర్ఘ విరామం తరవాత ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ సొంతమైంది. ఆదివారం దుబాయ్ లో జరిగిన ఫైనల్లో కివీస్ ని చిత్తు చేసిన భారత్ సగర్వంగా ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. ఈ మ్యాచ్ తరవాత కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్ అవుతాడన్న ఊహాగానాలు బలంగా వినిపించాయి. ఇటీవల రోహిత్ పెద్దగా ఫామ్ లో లేడు. ఫిట్నెస్ కూడా సరిగా ఉండడం లేదు. ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకొన్న తరవాత రిటైర్మెంట్ ప్రకటిస్తే హుందాగా ఉంటుందని అంతా అనుకొన్నారు. కానీ రోహిత్ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఇప్పట్లో తనకు రిటైర్మెంట్ ఆలోచనలు లేవని ఈ ఊహాగానాలకు తెర దింపాడు. ”సుదీర్ఘ కాలంగా క్రికెట్ ఆడుతున్నవాళ్లకు ఇంకా ఇంకా ఆడాలని ఉంటుంది. నేను కూడా అదే స్థితిలో ఉన్నా” అంటూ తన మనసులోని మాట వ్యక్తం చేశాడు. రోహిత్ ఇది వరకటి ఫామ్ లో లేని మాట నిజం. కాకపోతే తనదైన రోజున మ్యాచ్‌ని ఒంటి చేత్తో గెలిపించగలడు. ఫైనల్ లో రోహిత్ కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. తొలుత దూకుడు ప్రదర్శించిన రోహిత్, ఆ తరవాత పరిస్థితులకు తగ్గట్టు నిదానంగా ఆడాడు. కెప్టెన్‌గానూ తన వ్యూహాలు పని చేశాయి. స్పిన్నర్ చక్రవర్తిని చాలా తొందరగా బౌలింగ్ కు దింపాడు. దాంతో కివీస్ ఓపెనర్ల దూకుడుకు అడ్డుకట్ట వేసినట్టైంది. నలుగురు స్నిన్నర్లతో కూర్పు సిద్ధం చేయడం మామూలు విషయం కాదు. ఇవన్నీ భారత్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టిన వ్యూహాలే.
మరో రెండేళ్ల పాటు రోహిత్ తన ఫిట్ నెస్ కాపాడుకోవడం మామూలు విషయం కాదు. కాకపోతే అసాధ్యం కూడా కాదు. ఈ రెండేళ్లలో వన్డేలు తగ్గించుకోవాలి. కీలకమైన సిరీస్‌లు తప్ప, మిగిలినవాటికి దూరం అవ్వాలి. ఆయా సిరీస్‌లలో యువకుల్ని ఆడించి 2027 ప్రపంచకప్‌కు తగిన టీమ్ సిద్ధం చేసుకోవాలి. రోహిత్ లాంటి అనుభవజ్ఞుడు జట్టుకు అవసరం. తన హయాంలో వన్డే వరల్డ్ కప్ అందించాలన్నది రోహిత్ కల. అందుకోసమే… ఈ తపన. రోహిత్ కంటే విరాట్ కోహ్లి మరింత ఫిట్ తో ఉన్నాడు. తన దృష్టి కూడా 2027 వరల్డ్ కప్‌పైనే ఉంది. ఆ తరవాతే రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచనల్లో ఉన్నాడు కోహ్లీ. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో గెలిచిన తరవాత… కోహ్లీ, రోహిత్ సంబరాలు చేసుకొన్న విధానం, వాళ్ల అనుబంధం చూస్తే – వీరిద్దరి మధ్య పొరపొచ్చాలు వచ్చాయన్నది కేవలం రూమర్లే అని తేలిపోతుంది. 2027 వరల్డ్ కప్ గెలిచి, ఇంతే ఆనందంగా, అప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాలన్నది వీళ్ల ఆశయం కావొచ్చు. గొప్ప ఆటగాళ్లకు అంతకంటే గొప్ప వీడ్కోలు ఏముంటుంది?