రైతులను ఆదుకోవడానికి గాను ఒకో పంటకు ఎకరాకు రు.4000 చొప్పున సహాయం చేస్తామని టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన పథకం కౌలుదార్లను గుర్తించడానికి నిరాకరిస్తున్నది. పంటలు పండించడం కోసం అప్పులు తర్వాత గిట్టుబాటు ధర రాక తిప్పలు ఇదే రైతాంగ సంక్షోభం. ఆత్మహత్యలకు కారణమని నిపుణులు పరిశోధించి తేల్చారు. పంటలు పండించేవారిలో పెద్ద భాగం కౌలుదార్లే వుంటారు. తెలంగాణలో కనీసం 14 లక్షల మంది కౌలుదార్లున్నట్టు అంచనా. అయితే ముఖ్యమంత్రి కెసిఆర్ తమకు కౌలుదార్లతో సంబంధమే లేదని చెప్పేశారు. అది రైతులకూ వారికి మధ్య ఒప్పందమని తాము రైతులకే ఇస్తామని స్పష్టం చేశారు. సాగుదార్లకోసం ఉద్దేశించిన సహాయాన్ని స్వంత దార్లకు ఇస్తే ఏం ప్రయోజమనేది ప్రశ్న.
ఆంధ్రలో వలె తెలంగాణలో కౌలు దార్లు లేరన్నది నిజం కాదు.వాస్తవానిక తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో 1953లో దేశంలోనే అత్యంత విప్లవాత్మకమైన కౌలుదారి చట్టం ఆమోదించింది హైదరాబాద్ రాష్ట్రమే. దున్నేవానిదే భూమి అన్న నినాదం ఇక్కడినుంచే వెళ్లింది. దీన్ని చాలా ఆలస్యంగా 2000 సంవత్సరం తర్వాత ఎపిలో వర్తింపచేశారు. అలాటిరాష్ట్ర పాలకులు కౌలురైతులను చూడలేకపోవడం భూస్వామ్య మనస్తత్వానికి నిదర్శనం. దీనిపై గ్రామాలలో తీవ్ర నిరసన రావడం అనివార్యమని టిఆర్ఎస్ నేతలు కూడా కంగారు పడుతున్నారు. అయితే కెసిఆర్ మాత్రం ససేమిరా అన్నట్టే వున్నారు. ఈ సహాయం ఎలా చేర్చాలన్నది కూడా ఇంకా ఒక కొలిక్కి రాలేదు. బ్యాంకులలో వేస్తే పాత బాకీల కింది మాఫీ వేసుకుంటాయి గనక నగదుగానే ఇవ్వాలని ఒక వాదన. అప్పుడు దుర్వినియోగం అవకతవకలు ఏ స్థాయిలో వుంటాయో వూహించవలసిందే. రాజధాని శివార్లలోనూ పట్టణ ప్రాంతాల్లోనూ వందల ఎకరాల భూమి కొనుగోలు చేసి రియల్ వ్యాపారం కోసం అట్టిపెట్టిన ఆసాములు , భూస్వాములు కూడా ఇప్పుడు ఎకరానికి 8 వేలు వస్తే లక్షలు వచ్చి పడతాయని పాచికలు వేస్తున్నారు. అమలుపై తుది నిర్ణయం తీసుకునేముందైనా ఇవి ఆలోచిస్తారేమో చూడాలి.