సంక్షేమ రంగంలో తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోంది. తాజాగా ఒంటరి మహిళలకు జీవనభృతి పథకాన్ని కేసీఆర్ శుక్రవారం ప్రకటించారు. వాళ్లకు ప్రతినెలా 1000 రూపాయల పెన్షన్ ఇస్తానని మాటిచ్చారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. మరి తన మంత్రివర్గంలో చేరడానికి ఒక్క మహిళా ఎమ్మెల్యేకు కూడా అర్హత లేదా అనే ప్రశ్నకు మాత్రం జవాబు లేదు.
కేసీఆర్ కు పలువురు మహిళలు ధన్యవాదాలు తెలిపారు. డ్వాక్రా సంఘాలు ఇతర సంస్థల మహిళలను ముఖ్యమంత్రిని కలిసి వేనోళ్ల పొగిడారు.అయితే అక్కడ ఒక సీన్ మిస్సయింది. ఇంత కీలకమైన నిర్ణయం ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రికి మహిళలు ధన్యావాదాలు తెలిపే సమయంలో మహిళా మంత్రి ఎవరూ లేరు,
తెలంగాణలో మహిళల సంక్షేమ బాధ్యతలు చూసే మంత్రి పేరు తుమ్మల నాగేశ్వర రావు. కనీసం మహిళా సంక్షేమ శాఖను చూడటానికైనా ఒక మహిళకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఇప్పటికే ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. జనాభాలో సగభాగం ఉన్న మహిళల తరఫున కేబినెట్ లో కనీస ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం వివక్ష కాక మరేమిటనే విమర్శలు మొదటినుంచీ ఉన్నాయి.
తెరాసకు అసెంబ్లీలో మహిళా సభ్యులు లేరా అంటే ఉన్నారు. వాళ్లలో ఒకరికి డిప్యుటీ స్పీకర్ పదవి ఇచ్చారు. అదొక్కటే ఘనకార్యంగా తెరాస నేతలు చెప్పుకుటారు. మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేసే వారు మంత్రిపదవి విషయంలో మాత్రం చిన్నచూపు చూడటం ఏమిటి? ఇప్పటికైనా కేసీఆర్ కొత్త సంవత్సరంలో ఆ లోటు భర్తీ చేస్తారేమో చూద్దామంటున్నారు మహిళా సంఘాల నాయకురాళ్లు.