ప్రభుత్వ మహిళా అధికారిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే దాడి, ఈ విషయంలో ఆయనపై పెట్టీ కేసులు పెట్టి… అరెస్ట్ చేసిన రెండు గంటల్లోనే విడుదల చేయడంపై జనేసన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు భద్రత ఎక్కడ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే క్రిమినల్ కేసులు పెడుతున్నారని.. కానీ ప్రభుత్వ అధికారులపై వైసీపీ నేతలు దాడులు చేస్తే.. బెయిలబుల్ కేసులు పెట్టి..మళ్లీ రోడ్ల మీదకు పంపుతున్నారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఉద్యోగులపై తెగబడి దాడులు చేస్తుంటే .. ఇక సగటు మహిళలకు భద్రత ఎక్కడ ఉంటుందని జనసేనాని మండిపడ్డారు. ఎంపీడీవో సరళపై కోటంరెడ్డి దాడి చేస్తే వైసీపీ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు.
కోటంరెడ్డిపై సరళ పెట్టిన క్రిమినల్ కేసును ప్రభుత్వం నిర్వీర్యం చేయడం ద్వారా… ప్రజలకు ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారని నిలదీశారు. ” మా ఎమ్మెల్యేలు దాడులు చేస్తారు.. మీరు భరించండి” అనేలా వైసీపీ ప్రభుత్వం తీరు ఉందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కోటంరెడ్డిపై కేసును పోలీసుల ద్వారా ప్రభుత్వమే నీరుగార్చిందని … తక్షణం తప్పు దిద్దుకుని కఠిన చర్యలు తీసుకోవాలని పవన్‌కల్యాణ్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో చట్టం రెండు రకాలుగా ప్రవర్తిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేన లేదా టీడీపీ కార్యకర్తలు ఎవరైనా సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెట్టినా… పోలీసులు పోలోమంటూ వచ్చేస్తున్నారు. కేసులు పెట్టినా పెట్టకపోయినా స్టేషన్లో కూర్చోబెట్టి వేధిస్తున్నారు.
ఇక ఓ మాదిరి నేతలైతే.. కేసులు పెడుతున్నారు. ధర్మవరం జనసేన ఇన్చార్జ్ చిలకం మధుసూదనరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ప్రజల కోసం… పని చేస్తే కేసు నమోదు చేయడం ఏమిటని జనసేన వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అదే వైసీపీ నేతలైతే.. దాడులు చేసినా.. దౌర్జన్యాలు చేసినా… పోలీసులు చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ కోటంరెడ్డి ఇష్యూ ద్వారా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు.