వైఎస్ కుటుంబంలో గొడవలు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియానే ససాక్ష్యంగా ప్రజల ముందు ఉంచుతోంది. తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నారు. దానికి సంబంధించి ఆమె భారీ హంగామా మధ్య అడుగులు ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని మీడియా సంస్థలూ… షర్మిల అడుగులపై ఆసక్తితో కవరేజీ ఇచ్చాయి.. ఇస్తున్నాయి. కానీ షర్మిల తోడబుట్టిన అన్న జగన్ మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియాలో మాత్రం కనీస కవరేజీ రావట్లేదు. కవరేజీ కాదుకదా.. అసలు షర్మిల మాటే వినిపించడం లేదు. ఈ అంశంపై సాక్షి మీడియా స్టాఫ్‌కు స్పష్టమైన సూచనలు వచ్చాయి. చెప్పే వరకూ షర్మిల గురించికానీ.. ఆమె పార్టీ గురించి కానీ ఎలాంటి వార్తలు .. ఇవ్వవొద్దని ఆదేశాలు వచ్చాయి. దాంతో కనీసం ఎప్పుడూ లోటస్ పాండ్‌లో కాచుకునికూర్చునే సాక్షి మీడియా సిబ్బంది ఈ సారి కనిపించలేదు.
లోటస్ పాండ్‌లో జగన్ నివాసం పక్కనే బ్రదర్ అనిల్ కార్యాలయం ఉంది. అక్కడి నుంచే షర్మిల రాజకీయం ప్రారంభించారు. పెద్ద ఎత్తున అభిమానుల హంగామాతో… ప్రస్తుతం లోటస్ పాండ్ కిక్కిరిసిపోయింది. సాక్షికి ఇవేమీ కనిపించలేదు. నిజానికి సాక్షి మీడియాలో షర్మిలను ఎప్పుడో ఎలిమినేట్ చేశారు. చివరికి రాఖీ పండుగ రోజు గతంలో… జగన్, షర్మిల అనుబంధం గురించి కథలు, కథలుగా చెప్పేవారు. కానీ రెండేళ్ల నుంచి చెప్పడం లేదు. షర్మిల అనే పేరు కానీ.. ఫోటో కానీ రావడం నిషేధించారు.
సాక్షి పత్రికకు.. ప్రస్తుతం వైఎస్ జగన్ భార్య భారతి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె నుంచి షర్మిల గురించి ఎలాంటి కవరేజ్ ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలు ఎప్పుడో ఇచ్చారు. జగన్ సీఎం కాక ముందే అంటే.. 2018 జూలైలో షర్మిల పాదయాత్రకు ఐదేళ్లయిన సందర్భంగా చాలా పెద్ద ఫీచర్స్ ప్లాన్ చేశారు. “మరో ప్రజా ప్రస్థానం” పేరుతో మూడు వేల కిలోమీటర్లకుపైగా ఆమె నడచి .. చరిత్ర సృష్టించిన రోజును గుర్తు చేసేందుకు నాలుగు పేజీలు రెడీ చేశారు. కానీ ఈ విషయం తెలిసి భారతీ ఒక్క సారిగాఫైరయిపోయారు. వాటిని ఆపేయించడమే కాదు.. అత్యుత్సాహం చూపిన ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు.
అప్పట్నుంచే కుటుంబంలో తేడాలున్నాయన్న ప్రచారం జరిగింది. అయితే ఎన్నికల్లో జగన్ కోసం తల్లి, చెల్లి ఇద్దరూ కలిసి ప్రచారం చేశారు. గెలిచిన తర్వాత జగన్ పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి.. పాత విషయాలు అన్నీ పెద్దవి కావడంతో పూర్తి గా సంబంధాలు తెగిపోయినట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడు…అన్ని మీడియాలు విస్తృతమైన కవరేజీ ఇస్తున్నా… సాక్షి మాత్రం పట్టించుకోకపోవడంతో ఆ గొడవలు నిజమేనని సాక్షి నిరూపిస్తోంది.