2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి .. కేంద్రం రూ. 10వేల 400 కోట్ల నిధుల్ని నేరుగా నగదు బదిలీ చేసింది. రాష్ట్రం మరో ఐదు వేల కోట్ల వరకూ ఆర్బీఐ దగ్గర అప్పు చేసింది.. ఇంకేముంది బటన్లు నొక్కడానికి, జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికి ఇబ్బంది లేదనుకున్నారు. కానీ ఒకటో తేదీ వస్తేనే కానీ అసలు విషయం బోధపడలేదు. ఇరవై శాతం మందికి మాత్రమే జీతాలొచ్చాయి. అది కూడా ఆర్బీఐ దగ్గర వేస్ అండ్ మీన్స్ కింద అప్పులు తీసుకుంటేనే ఇవ్వగలిగారు. ఎప్పట్లాగే జీతాల కోసం.. ఎదురు చూస్తూ పడినప్పుడు వాడుకోవాల్సిందే.
అయితే వచ్చిన డబ్బులన్నీ ఏం చేస్తున్నారన్నది మాత్రం ఎవరికీ అంతుబట్టడం లేదు. అప్పనంగా ఊహించని విధంగా కేంద్రం రూ. పది వేల కోట్లు నగదు బదిలీ చేస్తే… పండగ చేసుకోవాల్సిన ప్రభుత్వం ఇలా ఎందుకు ఇంకా ఆర్థిక కష్టాల్లో ఉందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఏమైనా అప్పులు తిరిగి చెల్లించారా లేకపోతే… పాత బాకీల కింద కేంద్రమే ఆ సొమ్ములు జమ చేసుకుందా లేకపోతే అస్మదీయ కాంట్రాక్టర్లకు ఏ పనులూ చేయకుండానే చెల్లించేశారా అన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు.
ఏపీ ప్రభుత్వం ప్రైవేటు కంపెనీ కాదు. అది ప్రజాప్రభుత్వం. ప్రజలు పన్నులుగా కట్టే సొమ్ములతోనే ప్రభుత్వం నడుస్తోంది. వాటి జమా ఖర్చులపై పూర్తి సమాచారం ప్రజలకు తెలియచెప్పాలి. ఈ విషయంలో ప్రజలకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి.. తమను అప్పుల పాలు చేసి మరీ చేస్తున్న ఆర్థిక వ్యవహారాల్లో భారీ అవకతవకలు జరుగుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. దీనిపై శ్వేతపత్రం విడుదల చేస్తేనే ప్రజలకు నిజాలేంటో తెలుస్తాయి. కానీ ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉందా ?