తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయాలను తూ.చ తప్పకుండా పాటించే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల జీతాల కోత విషయంలో మాత్రం.. ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం లేదనే వాదన వినిపిస్తోంది. నెలాఖరు రోజున.. జీతాల కోత నిర్ణయం తీసుకున్నా.. అమలు చేయడం కష్టమని.. ఇప్పటికే ఆర్బీఐకి బిల్లులను పంపేసి ఉంటారని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు నిధులకు వచ్చిన ఇబ్బంది లేదని.. ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే.. ఈ నెలల ఇరవై రెండో తేదీ నుంచి మాత్రమే.. ఆదాయం తగ్గిపోయింది. జనతా కర్ఫ్యూ ప్రకటించిన నాటి నుండే.. ప్రజలు బయటకు రావడం తగ్గిపోయింది. వ్యాపార కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. ఈ కారణంగా గత పది రోజులుగా మాత్రమే.. ఆదాయం పడిపోయింది.
అంతకు ముందు ఆదాయం బాగానే ఉంది. ఉద్యోగుల జీతాల చెల్లింపు తేదీలు పేరోల్స్ చూసేది కూడా.. ఈ నెల ఇరవయ్యో తేదీ వరకే. 20 టు 20 సైకిల్ ఉంటుంది కాబట్టి… ఈ నెల జీతాలు కట్ చేయాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది కానీ ఖర్చు భారీగా పెరగలేదు. కరోనా సహాయ చర్యల కోసం.. కేంద్రం విపత్తు నిధిని వాడుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఈ మేరకు ఏపీకి రూ. 1300 కోట్లు వాడుకునే అవకాశం లభించింది. ఈ మొత్తం నుంచే అన్ని రకాల సహాయ చర్యలు చేపడుతున్నారు. అదే సమయంలో… పేదలకు పంపిణీ చేసే బియ్యం.. ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉంది.
ఉచితంగా అదనంగా.. ఒక్క కేజీ కందిపప్పు మాత్రమే ఇస్తున్నారు. దాంతో.. అది కూడా ప్రభుత్వానికి పెద్ద భారం కాదనే అభిప్రాయం ఉంది. ఇక.. ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి రూ. వెయ్యి ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. జీతాలకు పెన్షన్లకు సర్దుబాటు చేసుకున్న తర్వాతే వెసులుబాటుని బట్టి ఈ ఆర్థిక సాయం ప్రకటించారని.. చెబుతున్నారు. ఈ నెల వరకూ ప్రభుత్వ ఉద్యోగులకు.. పెన్షనర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పరిస్థితి ఇలాగే ఉంటే.. వచ్చే నెలలో ఉద్యోగుల జీతాలు కట్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని భావిస్తున్నారు.