కరోనా ప్రభావం మీడియాపై గట్టిగానే ఉంది. దిన పత్రికలు, టీవీ ఛానళ్ల సంస్థలు సిబ్బందిని తగ్గించే పనిలో పడ్డాయి. జీతాలలో కోత విధించాయి. కొన్ని దిన పత్రికలు, వార పత్రికలు మూసేసే పరిస్థితికి వెళ్లాయి. ముఖ్యంగా జీతాల కోత ఉద్యోగస్థుల్ని ఇబ్బంది పెడుతోంది. `సంస్థలు ఉద్యోగుల పట్ల కారుణ్యం చూపించాలి. ఉద్యోగస్థుల్ని తొలగించొద్దు. వాళ్ల జీతాల్లోనూ కోత విధించొద్దు` అని ప్రభుత్వాలు కోరుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ విషయాన్ని సీరియస్గా చెప్పారు. జీతాల్లో కోత విధిస్తే.. తనకు చెప్పమని జర్నలిస్టు సంఘాల్ని కోరారు. అయితే కేసీఆర్ సొంత పత్రిక లాంటి నమస్తే తెలంగాణ కూడా ఉద్యోగస్థుల జీతాలలో 20 నుంచి 30 శాతం వరకూ కోత విధించారు. సొంత పత్రికలో ఉద్యోగస్థుల జీతాలు కట్ చేసి, బయటి పత్రికలకు మాత్రం నీతులు బోధిస్తే ఎలా? అనే విమర్శల్ని ఎదుర్కోవాల్సివచ్చింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ తనపై పడిన ఈ అపవాదును చెరిపేసే ప్రయత్నం చేశారు. ఎలాగంటే.. నమస్తే తెలంగాణ పత్రికలో పనిచేసే ఉద్యోగస్థులకు కట్ చేసిన జీతం ఇప్పుడు మరోసారి ఎకౌంట్లో జమ చేశారు. ఈ విధంగా ఉద్యోగస్థులు పూర్తి జీతం పొందినట్టైంది. మరి మిగిలిన సంస్థలూ… ఉద్యోగుల పట్ల ఇలానే పెద్ద మనసు చూపిస్తాయేమో చూడాలి.