వచ్చే వారం ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తామని.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత నెల ఇరవై తొమ్మిదో తేదీన ప్రకటించారు. పది రోజులు గడిచిపోయినా.. ఇసుక వారోత్సవాల గురించి.. మరో ప్రకటన లేదు. వారం రోజుల ప్రభుత్వ అధికార యంత్రాంగం అంతా ఇసుకపై పని చేసి..విపక్షాలను మాట్లాడకుండా చేస్తామని జగన్ శపథం చేశారు. కానీ.. ఆ తర్వతా ఆ మాటలు.. మాటలకే పరిమితమయ్యాయి. పరిస్థితి ఎప్పటిలాగే ఉంది. ఎవరూ ఇసుక సమస్యను ఎలా పరిష్కరిద్దామా అన్న ఆలోచన చేయడం లేదు. కనీసం ముఖ్యమంత్రి ప్రకటించారు కదా.. వారోత్సవాలు అయినా ప్రారంభిద్దామనే ఆలోచన చేయలేదు. అసలు వారోత్సవాలంటే.. ఏం చేయాలి.. ఎలా చేయాలి అన్నదానిపైనే.. ఇసుక మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి ఇంకా వర్కవుట్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే.. ఆ వర్కవుట్ ఇంకా ప్రారంభం కాలేదు.
ఇసుక వారోత్సవాల్లో.. ఎక్కడ ఇసుక ఉంటే.. అక్కడ తవ్వి.. ప్రజలకు చేర వేస్తామని..వారం రోజుల పాటు.. అందరూ అదే పని మీద ఉండాలని.. జగన్ … సమీక్షలో చెప్పుకొచ్చారు. జగన్ చెప్పిన ఆ “వచ్చే వారం” ప్రారంభమై.. మరో వారం రోజులు అయింది. ఇంకా.. ఇసుకకొరతపై.. వరదల సాగులే చెబుతున్నారు. ఏపీలో వర్షాలు ఆగిపోయి.. చాలా కాలం అయింది. ప్రాజెక్టులన్నీ నిండుగా ఉన్నాయి కాబట్టి.. వాటిని వినియోగించుకునే కొద్ది మాత్రమే..నీరు తగ్గుతాయి. అంటే.. ఈ పరిస్థితి మరో రెండు, మూడు నెలలు ఉంటుంది. ప్రాజెక్టుల్లో నీరు అప్పటి వరకూ ఫుల్గా ఉంటుంది. ప్రభుత్వ వాదన ప్రకారం చూస్తే.. నదుల్లో నీటి నిల్వ తగ్గగానే ఇసుక తవ్వకాలు చేద్దామనుకుంటున్నారు. ఆ నీటి నిల్వ మరో రెండు, మూడు నెలలు తగ్గే అవకాశం లేదు.
ఎగువ నుంచి వచ్చే వరద ఆగిపోతే.. సరిపోతుందని.. వెంటనే ఇసుక తవ్వొచ్చన్న ఉద్దేశంతో.. జగన్మోహన్ రెడ్డి ఇసుక వారోత్సవాల గురించి ప్రకటించినట్లుగా అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే.. వరద మాత్రమే. ఇసుక కొరతకు కారణం కాదని.. నిపుణులు మొదటి నుంచి చెబుతున్నారు. అసలు సమస్య పరిష్కారంపై .. ఏపీ సర్కార్ ఎలాంటి పరిశీలన చేయకుండా.. వరద అనే.. ఒక్క కారణానికే ఫిక్స్ అయిపోయింది. దాంతో.. సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. సీఎం ప్రకటించిన వారోత్సవాలూ..ఉత్తుత్తిగానే మిగిలిపోతున్నాయి. ముఖ్యమంత్రి ప్రకటనకే విలువ లేకుండా పోయినట్లయింది.