శాటిలైట్ మార్కెట్ ఎప్పుడో నీరసించిపోయింది. కొత్త మొహాలతో సినిమా తీస్తే.. శాటిలైట్‌పై ఆశలు వదులుకోవాల్సిందే. మీడియం రేంజు హీరోల సినిమాలు కూడా శాటిలైట్ అవ్వడం కష్టాతి కష్టంగా మారింది. సినిమా విడుదలై…. ఏమాత్రం అయినా ఆడితే అప్పుడు శాటిలైట్ హక్కులు కొనుక్కొందాం అని టీవీ ఛానళ్లు ఫిక్సయిపోతున్నాయి. అయితే కామెడీ హీరోలకు మాత్రం ఢోకా ఉండేది కాదు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ సినిమాలకు మించింది ఏదీ లేదు. కొన్ని సినిమాలు థియేటర్లో ఫ్లాప్ అయినా.. టీవీల్లో తెగ ఆడేస్తాయి. సినిమా మొత్తం కాకపోయినా.. అందులో బిట్లు బిట్లుగా కట్ చేసి కామెడీ ఎపిసోడ్లు రన్ చేసుకోవొచ్చు. అందుకే.. కామెడీ సినిమా వస్తోందంటే.. టీవీ ఛానళ్లు ఎలెర్ట్ అయిపోతుంటాయి. నరేష్, సునీల్ లాంటి హీరోల సినిమాలకు శాటిలైట్ బాగానే గిట్టుబాటు అవుతుండేది. నరేష్‌కి వరుస ఫ్లాపులు ఎదురైనా.. శాటిలైట్ విషయంలో మాత్రం బాగానే కాసులు రాలతాయి. అదే ధైర్యంతో నరేష్ తో సినిమాలు చేయడానికి నిర్మాతలు ముందుకొస్తుంటారు.
సునీల్దీ ఇంచుమించుగా అదే పరిస్థితి. తన తొలి సినిమా ‘అందాల రాముడు’ నుంచి.. నిన్నా మొన్నటి వరకూ శాటిలైట్ సమస్య ఎప్పుడూ రాలేదు. అయితే… ఈమధ్య సునీల్ సినిమా అనగానే టీవీ ఛానళ్లు కూడా.. నొసలు చిట్లిస్తున్నాయి. ‘జక్కన్న’ కమర్షియల్‌గా ఓకే అనిపించుకొన్న సినిమా. రూపాయి పెడితే.. పావలా పోయింది. అలాంటి సినిమాకే శాటిలైట్ అవ్వలేదింకా. ఆ తరవాత వచ్చిన ‘ఈడు గోల్డెహె’ పరిస్థితి మరీ ఘోరం. రూపాయి పెడితే.. పావలా కూడా రాలేదు. ఇలాంటి సినిమాకి శాటిలైట్ ఎందుకు అవుతుంది? విడుదలకు ముందు రెండు కోట్ల ఫ్యాన్సీ ఆఫర్ వస్తే నిర్మాతలు వదులుకొన్నారు. రెండున్నర ఇస్తే గానీ.. ఈడు గోల్డెహె. ఇవ్వం అన్నారు. తీరా చూస్తే ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయ్యింది. కోటిన్నరకైనా ఈ సినిమాని వదిలించుకోవాలని నిర్మాతలు చూస్తుంటే… కోటికి కూడా కొనడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. అలా ఉంది… సునీల్ పరిస్థితి. శాటిలైట్ మార్కెట్‌పై ఎప్పుడైతే ఆశలు వదులుకొన్నారో.. ఇక సునీల్‌తో సినిమాలు చేయడానికి నిర్మాతలు ధైర్యం చేయడం కష్టమే. ఓ సూపర్ డూపర్ హిట్ కొడితే గానీ.. సునీల్ మళ్లీ నిర్మాతల్లో, ప్రేక్షకుల్లో నమ్మకం తీసుకురాలేడు. మరి ఆ హిట్ ఎప్పుడొస్తుందో?