తెలంగాణలో రాజకీయ సంచలనం సృష్టిస్తుందనుకున్న కేసుల్లో ఒకటి ఫార్ములా ఈ రేసుకేసు. ఇప్పుడు ఈ కేసులో ఎవరూ చప్పుడు చేయడం లేదు. మంచి వేడి మీద ఉన్నప్పుడు ఫార్ములా ఈ రేసును నిర్వహిస్తున్న ఎస్ఈవో కంపెనీకి నోటీసులు జారీ చేశారు. ఇక తప్పదన్నట్లుగా ఆ కంపెనీ ప్రతినిధులను వర్చువల్ గా ప్రశ్నించినట్లుగా పోలీసులు మీడియాకు సమాచారం ఇచ్చారు. అంతకు మించి ఈ కేసులో కదలకలేమీ కనిపించడం లేదు.
బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయే ముందు అక్రమంగా రూ.యాభై కోట్లు ఎఫ్ఈవో కంపెనీకి తరలించారనేది అభియోగం. ఇందులో కుట్ర ఉందని చెప్పి కేసులు పెట్టేందుకు గవర్నర్ అనుమతి తీసుకున్నారు. చాలా సమయం తీసుకుని కేసులు పెట్టారు. ఈ కేసుల్లో ఐఏఎస్ అర్వింద్ కుమార్ ను అప్రూవర్ గా చేసి కేటీఆర్ ను అరెస్టు చేస్తారని అనుకున్నారు. కానీ ఏ ఒక్క అడుగు ముందుకు వేయడం లేదు. కేటీఆర్ ను ప్రశ్నించారు కానీ అరెస్టు వరకూ వెళ్లలేదు.
అరెస్టులు చేయాలనుకుంటే ఏ అడ్డంకి లేదు. చివరికి సుప్రీంకోర్టులోనూ కేటీఆర్ కు ఊరట లభించలేదు. అంతా జరిగిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు పూర్తిగా సైలెంట్ అయిపోయాయి. ఈ కేసులో ఎలాంటి తదుపరి చర్యలు ఉంటాయో కూడా క్లారిటీ లేదు. అక్రమంగా తరలిపోయాయనని చెబుతున్న నగదు మళ్లీ బీఆర్ఎస్ పెద్దలకు చేరిందా..లేకపోతే స్పాన్సర్ షిప్ రద్దు చేసుకున్న గ్రీన్ కో తో ఏమైనా క్విడ్ ప్రో కో జరిగిందా.. ఇలాంటివన్నీ తేల్చడానికి సోదాలు కూడా చేశారు. ఏం బయటపడిందో మాత్రం ఎవరికీ తెలియదు.
మరో వైపు ఈడీ కూడా ఈ కేసు విషయంలో మొదటగా దూకుడుగా వ్యవహరించింది. తర్వాత పట్టించుకోవడం లేదు. న్యాయపరంగా అన్ని ఎదురు దెబ్బలు తిన్న కేటీఆర్.. అరెస్టు కాకుండా సేఫ్ గా ఉంటున్నారు. అరెస్టు చేస్తే అనవసరంగా వాళ్లకి మైలేజీ ఇచ్చినట్లవుతుందని అనుకుంటున్నారేమో కాని.. సైడ్ చేసేస్తున్నారు.