నందమూరి బాలకృష్ణ – తేజల కాంబినేషన్లో ఎన్టీఆర్ బయోపిక్ రూపుదిద్దుకోనుంది. ఎన్టీఆర్ ఆత్మకథ, అందులోనూ ఆ పాత్రలో బాలయ్య… ఇంత కంటే ఏం కావాలి?? అందుకే ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులతో పాటు, యావత్ తెలుగు ప్రజానికం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య ఫిక్సయిపోయాడు. మరి మిగిలిన పాత్రల్లో ఎవరు కనిపిస్తారు? ఏఎన్నార్‌గా ఎవరు నటిస్తారు? సావిత్రి పాత్ర ఉంటుందా? ఎన్టీఆర్ తనయుల్లో ముఖ్యులైన బాలకృష్ణ, హరికృష్ణలుగా ఎవరు కనిపిస్తారు? ఇలా అన్నీ ప్రశ్నలే.
హరికృష్ణగా కల్యాణ్ రామ్ కనిపిస్తారన్న ఓ న్యూస్ ఇప్పుడు జోరుగా చక్కర్లు కొడుతోంది. హరికృష్ణ పాత్రని తనయుడు చేయడం నిజంగా భలేటి ఐడియా. బాలయ్యగా మోక్షజ్ఞ అని అభిమానులూ ఊహల్లో ఊరేగుతున్నారు. ఈ ఐడియా తేజకు వచ్చిందో రాలేదో మరి. కల్యాణ్ రామ్ సన్నిహితులు మాత్రం.. ‘తేజ సినిమాకి సంబంధించి కల్యాణ్‌రామ్ ఎలాంటి చర్చలు జరపలేదు’ అని కుండ బద్దలు కొట్టేశారు. అసలు విషయం ఏమిటంటే.. ఎన్టీఆర్ బయోపిక్‌లో హరికృష్ణ, బాలకృష్ణల పాత్రలు నామమాత్రపు ప్రాధాన్యం సంతరించుకొన్నవట. ఎన్టీఆర్ జీవితం, సినిమా కెరీర్, రాజకీయ ప్రస్థానంలో బాలయ్య, హరికృష్ణల ప్రస్తావన తీసుకురాకుండానే కథని నడిపిస్తున్నారని టాక్. ఒకవేళ ఉన్నా ఒకట్రెండు సన్నివేశాలకే పరిమితం. అలాంటి పాత్రలకు కల్యాణ్‌రామ్, మోక్షజ్ఞలను ఎందుకు ఎంచుకొంటారు? ”ఎన్టీఆర్ ఆత్మ కథలో కీలకమైన అంశాలు చాలా ఉన్నాయి. రెండు గంటల్లో వాటిని విశదీకరించడం కష్టం. అందుకే ఆయన కుటుంబం, మిగిలిన వ్యవహారాలకూ ఈ సినిమాలో చోటు లేకపోవొచ్చు” అని బాలయ్య సన్నిహితులు చెబుతున్నారు. సో… ఇది కేవలం ఓ వర్గపు ప్రచారం మాత్రమే.