ఎలాగోలా కాంగ్రెస్ పార్టీని ఫామ్ లోకి తేవడం కోసం రాహుల్ గాంధీ పడాల్సిన పాట్లు పడుతున్నారు. చేయాల్సిన ఫీట్లన్నీ చేస్తున్నారు. యువరాజుకి గుజరాత్ లో కొంత హోప్ కనిపిస్తోంది. భాజపా పాలన మీద గుజరాతీయులకు మొహం మొత్తిందనీ, ప్రధానిగా మోడీ తీసుకున్న నిర్ణయాలు వారి మాడు పగులగొట్టాయంటూ ప్రచారం చేసుకుంటూ కాంగ్రెస్ ను బాగానే లాక్కొచ్చారు. చివరికి, మోడీ కూడా తాను నిత్యం జపించే అభివృద్ధి మంత్రానికి నీళ్లొదిలేసి, సొంత ఆయుధమైన హిందుత్వ భావజాలాన్నే తెరమీదికి తేవాల్సి వచ్చిందంటే… దాని వెనక రాహుల్ ప్రభావం ఉన్నట్టే. గడచిన రెండు వారాల్లోనే గుజరాత్ లో కాంగ్రెస్ గ్రాఫ్ ఒకేసారి ఊర్ధ్వముఖానికి ఎగసిందనే అనిపించింది. సర్వేలు కూడా కాంగ్రెస్ కి ఇచ్చిన ఓట్ల శాతాన్ని పెంచుతూ వచ్చాయి. అంతా బాగుంది అనుకునేసరికి.. కడివెడు పాలలో చల్లచుక్క వేసినట్టుగా, ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ కి అనుకోని తలనొప్పి తెచ్చిపెట్టారు.
ఆ సీనియర్ నాయకుడే… మణిశంకర్ అయ్యర్. ఏదో సమావేశాలో మాంచి ఫ్లోలో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ‘నీచ్ ఆద్మీ’ అనేశారు. ఈ రెండు పాదాలతో భాజపా నెత్తిన పాలు పోసినట్టయింది! నీచ్ ఆద్మీ అంటే.. నీచమైన మనిషి అనే అర్థంలో అయ్యర్ ఆ పదాన్ని ప్రయోగించి ఉండొచ్చు. కానీ, దానికి గుజరాత్ లో వారికి పనికొచ్చే అర్థాన్ని భాజపా చెప్పుకుంది. ఈ కామెంట్ కి మోడీ సాబ్ కాస్త సెంటిమెంట్ జోడించారు. ‘అవునూ.. నేను నీచజాతి వాడినే. తక్కువ జాతి నుంచి వచ్చినవాడినే. అందుకే, వాళ్ల కోసమే నా జీవితాన్ని ధారపోస్తున్నాను’ అంటూ ఆయన మొదలెట్టేశారు. ఆ రెండు పదాలకు మరింత విస్తృతార్ధం చెబుతూ… ఇలాంటి వ్యాఖ్యల ద్వారా దేశంలోని బీసీలందరినీ కాంగ్రెస్ నేతలు అవమానిస్తున్నారు, ముఖ్యంగా గుజరాతీయులను నీచంగా చూస్తున్నారంటూ ఇతర భాజపా నేతలు రెచ్చిపోయారు. ఆ రెండు పదాలు ఇంత రచ్చ చేస్తాయని మణిశంకర్ అయ్యర్ కు తెలియకపోవచ్చు! కానీ, ఆయన్ని ఏమీ అనలేక… సమర్థనగా మాట్లాడలేక రాహుల్ గాంధీ తలపట్టుకునే పరిస్థితి వచ్చింది.
ఇదొక్కటే కాదు… మరో సీనియర్ నేత కపిల్ సిబల్ కూడా ఇలానే రాహుల్ ని అమృతాంజన్ అవసరాన్ని గుర్తుచేశారు! గుజరాత్ లో హిందుత్వ కార్డు పనిచేస్తుందనే లెక్కల్లోనే రాహుల్ కూడా గుళ్లూ గోపురాలంటూ తిరిగారు. తానూ హిందూ బ్రాహ్మిణ్ అంటూ ప్రవర చెప్పుకున్నారు. సరిగ్గా, ఈ తరుణంలో ‘యాంటీ అయోధ్య’ వాదనను సుప్రీం కోర్టులో సిబల్ వినిపించారు. తన క్లైంట్ కోసం అయోధ్య వివాదంపై ఆయన మాట్లాడినా… దాన్ని కాంగ్రెస్ నేత కామెంట్ గానే గుజరాతీయులకు భాజపా ప్రొజెక్టర్ పెట్టి చూపించే ప్రయత్నం చేసింది. దీంతో గుజరాత్ ఎన్నికల ముగిసేవరకూ ఆయన్ని కాస్త కాంట్రోల్ గా ఉండాలంటూ రాహుల్ అన్యాపదేశంగా చెప్పాల్సి వచ్చిందట! ఇప్పుడీ ఇద్దరు సీనియర్లు చేసిన రచ్చే గుజరాత్ ఎన్నికల్లో ఇబ్బందిగా మారే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ క్యాంపులో చర్చ జరుగుతోందని కథనాలు వస్తున్నాయి.
ఎలాగోలా తనపై ఉన్న వైఫల్య మరకల్ని గుజరాత్ లో కడుక్కుందామని రాహుల్ ఆశపడితే.. చివర్లో ఈ సీనియర్లు చేసిన పనులు యువరాజుకు టెన్షన్ పెంచుతున్నాయట. నిజానికి, కాంగ్రెస్ లో సీనియర్లను పక్కన పెట్టే కార్యక్రమాన్ని రాహుల్ చాన్నాళ్ల కిందటే మొదలుపెట్టారు. తనచుట్టూ కొత్త కోటరీని పెట్టుకుంటున్నారు. వివిధ రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ లను మార్చడం, సలహాదారులను మార్చడం చేశారు. అలాంటప్పుడు, సీనియర్లలో కొంత గుస్సా ఉంటుంది కదా. మరి, అలాంటి ఆలోచనలే ఈ ఇద్దరి సీనియర్ల చేత, ఇలాంటి కీలక సమయంలో అలాంటి వ్యాఖ్యలు చేయించాయా అనే అనుమానం కూడా కొంతమందికి కలుగుతోంది.