ఈవారం మూడు సినిమాలొచ్చాయి. మూడింటి రిజల్ట్ ఒకేలా ఉన్నాయి. స్కంద విపరీతమైన ట్రోల్స్‌కి గురవుతోంది. బోయపాటి ఎప్పటిలానే లాజిక్‌కి అందని సినిమా తీశాడని, సైన్స్ సూత్రాలు సైతం కొన్ని స్ననివేశాలు చూసి కంగారు పడుతున్నాయని.. స్కందపై సెటైర్లు వేసుకొంటున్నారు. అయితే ఈ సినిమాకి ఓపెనింగ్స్ బాగున్నాయి. బ్రేక్ ఈవెన్ అవుతుందో, లేదో తెలీదు కానీ, ఉన్న వాటిలో ఈ సినిమానే కాస్త బెటర్.
పెదకాపు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఓ కొత్త హీరోపై భారీగా ఖర్చు పెట్టి తీసిన సినిమా ఇది. మితిమీరిన హింస.. కుటుంబ ప్రేక్షకుల్ని ఈ సినిమాకి దూరం చేసింది. దర్శకుడు చెప్పాలనుకొన్న విషయన్ని చెప్పకుండా ఏదేదో చెప్పాడు. తాను కన్ఫ్యూజ్ అయి ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్కి గురి చేశాడు. బాక్సాఫీసు పరంగానూ ఈ సినిమాకి నిరాశే. ఎక్కడా ఈ సినిమాకి సరైన వసూళ్లు రావడం లేదు.
చంద్రముఖి 2 పరిస్థితి ఇంకా తీసినట్టు. ఈ అరవ డబ్బింగ్ సినిమాని ఎవరూ పట్టించుకోవడం లేదు. చంద్రముఖి పరువు తీసేలా..చంద్రముఖి 2 తీశారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. లారెన్స్ ఖాతాలో మరో డిజాస్టర్ ఇది.
అయితే ఈ మూడు సినిమాలకూ ఓ విషయంలో పోలిక ఉంది. స్కంద 2 రాబోతోందని క్లైమాక్స్ కార్డులో చూపించారు. పెదకాపు ని రెండు భాగాలుగా విడగొట్టి మొదటి భాగం ఇప్పుడు విడుదల చేశారు. చంద్రముఖి 3 కూడా ఉంటుందని చివర్లో హింట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ సీక్వెల్స్ దాదాపు రానట్టే. స్కంద 2 తీసే ధైర్యం అటు బోయపాటికీ ఇటు రామ్కీ ఉండాలనుకోవడం అత్యాస. పెదకాపు 2 షూటింగ్ ఇంకా మొదలెట్టలేదు. ఈ రిజల్ట్ చూసి పెదకాపు 2 కి నిర్మాత బడ్జెట్ పెడతాడా? అనేది పెద్ద అనుమానం. ఇక చంద్రముఖి 2కి వచ్చిన స్పందన చూస్తే… ఇక ఈ ఫ్రైంచైజీకి ఇదే ఆఖరు సినిమా అని తేలిపోయింది. సో.. మరో భాగం తప్పకుండా ఉంటుందని సగర్వంగా ప్రకటించుకొన్న ఈ చిత్రాలు ఇప్పుడుచ వెనకడుగు వేయడం ఖాయం.