సీక్వెల్ అంటే అందరికీ మక్కువే. ఓ విజయవంతమైన కథని, ఫార్ములానీ, టైటిల్నీ, ఆ కాంబినేషన్ నీ మళ్లీ వాడుకునే వెసులుబాటు సీక్వెల్ తో వస్తుంది. కాకపోతే.. తెలుగు నాట సీక్వెల్స్ అంతగా ఆడలేదు. అదో బ్యాడ్ సెంటిమెంట్. మారుతి తీసిన భలే భలే మగాడివోయ్ సీక్వెల్ పైచాలా కాలంగా వార్తలొస్తున్నాయి. ఈ సినిమాకి కొనసాగింపు వస్తుందని అనుకున్నారు. ఇది సీక్వెల్ కి అనువైన కథ కూడా. అయితే… మారుతి మాత్రం సీక్వెల్ కి `నో` అంటున్నాడు.
తన సినిమాల్లో తనకు బాగా నచ్చిన సినిమా `భలే భలే మగాడివోయ్` అని, ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నప్పుడు చాలా సంతృప్తిగా ఉంటుందని, అప్పుడే సీక్వెల్ తీయాలన్న ఉత్సాహం ఏర్పడుతుందని, అయితే.. ఆ కోరిక కొద్దిసేపే ఉంటుందంటున్నాడు మారుతి. ”సీక్వెల్ చేయాలన్న ఉత్సాహం ఉంది. కానీ చేయను. ఏదైనా సరే కొత్తగా చెప్పాలి. కొత్త కథ చెప్పాలి. నా దగ్గర కొత్త కథలు చాలా ఉన్నాయి. అందుకే సీక్వెల్స్ జోలికి వెళ్లను” అని క్లారిటీ ఇచ్చేశాడు.