సినిమాలు, షూటింగులు ఈ హడావుడి మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో తెలీదు. మే 17 తరవాతైనా చిత్రసీమ సడలింపుల్లో భాగం అవుతుందా, లేదా? అనేది ఇప్పటికైతే జవాబు లేని ప్రశ్న. కేరళ లాంటి రాష్ట్రాల్లో.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతులు ఇచ్చారు. అక్కడ షూటింగులు కూడా మొదలయ్యే ఛాన్సుంది. కానీ.. తెలుగు నాట అందుకోసం ఇంకొంత కాలం ఎదురుచూడక తప్పదు.
ఒకవేళ ప్రభుత్వం షూటింగులకు అనుమతులు ఇచ్చినా, ధైర్యంగా ముందుకొచ్చే పరిస్థితి లేదని ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ తేల్చేశారు. కరోనా భయాలు ఇంకొన్నాళ్లు వెంటాడతాయని, లాక్ డౌన్ ఎత్తేసి, షూటింగులు చేసుకోమన్నా – హీరోలు, నిర్మాతలు ధైర్యం చేయరని ఆయన చెబుతున్నారు. ఈరోజు మంత్రి తలసానిని టాలీవుడ్ నిర్మాతల బృందం కలుసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కల్యాణ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యాలు చేశారు. థియేటర్లకు జనం వస్తారన్న సంగతి రూఢీ అయితేనే షూటింగులు మొదలవుతాయని, థియేటర్లు తెరుస్తారో, జనాలు వస్తారో రారో, తేలక ముందు సినిమాలు పూర్తి చేసుకుని, డబ్బాలు లాబుల్లోనే ఆపుకోలేమని, కేరళలో అనుమతులు ఇచ్చినా, అక్కడ ఇంకా పనులు మొదలవ్వలేదని చెప్పుకొచ్చారు కల్యాణ్.
కరోనా భయాలు హీరోలకు, దర్శకులకు కొన్నాళ్లు వెంటాడతాయి. ఇది వరకటిలా వందల మంది గుంపులో షూటింగులు చేసుకోలేరు. కరోనా ఎక్కడ ఏమూలన నక్కిందో అనే భయం. విదేశాల్లో షూటింగ్ అనే ఆలోచన ఇప్పట్లో ఎవరూ చేయరు. సినిమాలు లేకపోయినా ఫర్వాలేదు, ప్రాణాలు ముఖ్యం అనుకుంటున్నారు కొంతమంది హీరోలు. వాళ్లని ఒప్పించి, సెట్స్‌పైకి తీసుకురావాలంటే దర్శక నిర్మాతలకు తలకు మించిన భారం. సో… దేవుడు వరమిచ్చినా, పూజారి కరుణించలేదన్నట్టు… ప్రభుత్వాలు సై అన్నా – స్టార్లు ముందుకు రావడం అంత తేలికైన విషయం కాదు.