తెలంగాణ రాష్ట్ర సమితిలో హరీష్‌రావు అంటే.. ఒకప్పుడు నెంబర్ టూ. కేసీఆర్ తర్వాత అంత పవర్ ఫుల్. కేసీఆర్ తో కాని పనులు కూడా హరీష్‌తో అయ్యేవి. గతంలో ఉపఎన్నిక వచ్చినా.. బహిరంగసభలు నిర్వహించాలన్నా.. ముందుగా హరీష్ రావునే పిలేచేవారు కేసీఆర్. మొత్తం బాధ్యతలు ఆయనకే అప్పగించేవారు. కేసీఆర్ ఇచ్చిన బాధ్యతలను ఒంటి చేత్తో నిర్వహించేవారు. అవి ఎన్నికలైనా.. సభలైనా సరే. చాలా సార్లు హరీష్ సామర్థ్యాన్ని కేసీఆర్ బహిరంగసభా వేదికపైనే ప్రశంసించారు కూడా.
కానీ.. కుమారుడికి పట్టం కట్టాలనుకుంటున్న కేసీఆర్ మెల్లగా హరీష్ రావు ప్రాధాన్యం…తగ్గిస్తూ వస్తున్నారు. పాతిక లక్షల మందితో… కొంగకలాన్‌లో నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగసభ బాధ్యతలను… కేసీఆర్ .. తన కుమారుడు కేటీఆర్‌కే అప్పగించారు. మామూలుగా అయితే.. ఇలాంటి మెగా సభలు నిర్వహించే బాధ్యతను హరీష్ కు అప్పగిస్తారు. ఇప్పుడు ఆ ప్లేస్‌లోకి కేటీఆర్ వచ్చారు. కేటీఆర్ ప్రతీ రోజు.. సభా ప్రాంగణానికి వెళ్లి ఏర్పాట్లు సమీక్షిస్తున్నారు. అలాగే… ఇతర మంత్రులూ వస్తున్నారు. వెళ్తున్నారు. కానీ హరీష్ రావు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ప్రగతి నివేదన సభలో హరీష్ రావు కంట్రిబ్యూషన్ సిద్దిపేట నుంచి.. జనాలను సభకు తరలించే వరకే.,
ఇదొక్కటే.. కాదు.. ఇటీవలి కాలంలో నిజంగానే హరీష్ రావు ప్రాధాన్యం.. టీఆర్ఎస్లో తగ్గిపోయింది. ముఖ్యమంత్రి స్థాయి నిర్ణయాలన్నీ.. ఇప్పుడు కేటీఆర్ తీసుకుంటున్నారు. కేవలం ప్రాజెక్టుల విషయంపై మాత్రమే.. అప్పుడప్పుడు మీడియాలో కనిపిస్తున్నారు. ఈ పరిస్థితులన్నీ చూస్తూంటేనే.. హరీష్ రావు పూర్తిగా సైడైపోతున్నారన్న ప్రచారం టీఆర్ఎస్ లో ఊపందుకుంటోంది. కేటీఆర్ పట్టాభిషేకం కోసమే.. ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నందున… కేటీఆర్ చెప్పిన వారికే కేసీఆర్ టిక్కెట్లు ఇస్తారు. హరీష్ రావు… తన స్థానం తప్ప.. మరో అనుచరుడికి కూడా టిక్కెట్ ఇప్పించుకునే పరిస్థితి ఉండదని టీఆర్ఎస్ వర్గాలు ఇప్పటి నుంచే బహిరంగంగానే చెబుతున్నాయి.